న్యాయ సదస్సలో సీనియర్ న్యాయవాదుల డిమాండ్
మేధావులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు : వినోద్ కుమార్
కరీంనగర్ -జనత న్యూస్
కొత్త న్యాయ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు`చేర్పులు చేసి తీరాల్సిందేన్నారు మాజీ ఎంపీ, సీనియర్ న్యాయవాది బోయినిపల్లి వినోద్ కుమార్. కరీంనగర్ ఫిలిం భవన్‌లో ప్రజా మిత్ర ప్రోగ్రెసీవ్ డెమొక్రటివ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కొత్త న్యాయ చట్టాలపై సదస్సు నిర్వహించారు. సీనియర్ న్యాయవాది కొరివి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు పలువురు రాజకీయ నేతలు, న్యాయ వాదులు, సామాజిక వేత్తలు హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న వినోద్ కుమార్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా, ఎవరినీ సంప్రదించకుండా న్యాయ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఇందులో అనేక లోపాలున్నాయని..వీటి వల్ల న్యాయం జరిగే అవకాశాలు తగ్గుతాయని తెలిపారు. దీనిపై తాను సుప్రిం కోర్టును ఆశ్రయించానని, వారంలోపు విచారణకు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. కొత్త న్యాయ చట్టాలను మార్చాలని ఇప్పటికే మేధావులు కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని..సుప్రిం కోర్టు జోక్యం చేసుకునే అవకాశాలున్నట్లు తెలిపారు. పోలీసులకు విశేష అధికారాలు ఇవ్వడం వల్ల చట్టాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్త చేశారు. వీటిని సమీక్షించి మార్పులు`చేర్పులు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో ప్రారంభమైన చర్చ, దేశ వ్యాప్తంగా విస్తరించి..ఉద్యమానికి దారి తీస్తుందని తెలిపారు. ఈ సదస్సుకు మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావుతో పాటు పలువురు హాజరై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిన 90 వరకు ఛార్జిషీట్ దాఖలు చేసే రైట్ పోలీసులకు కల్పించిందని..దీని ద్వారా పోలీసు అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయని తెలిపారు. కొత్త న్యాయ చట్టాల వల్ల పేద, మధ్య తరగతి వర్గాలకు పెద్ద శిక్షలు పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.