రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
రామగుండం, జనతా న్యూస్: నివాసం లేని నిరు పేదలందరికీ దశలవారీగా ఇళ్లు అందించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించా మని, రామగుండం ప్రాంతంలో నిరుపేద ఆటో కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం ఆయన రామగుండం లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సింగరేణి నిధులు 142 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించే 355 అదనపు పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ,142 కోట్ల అంచనా వ్యయంతో 355 అదనపు పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఈ రోజు ప్రజాప్రభుత్వం శంకుస్థాపన చేసిందని, ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా ఈ భవన నిర్మాణాన్ని సకాలంలో నిర్మిస్తామని అన్నారు.
రామగుండం ప్రాంతంలోని యువతకు పరిశ్రమలకు ఉపయోగపడే నైపుణ్యత కల్పించే శిక్షణ అందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ముందుగా పెద్దపల్లిలో టాస్క్ సెంటర్ మంజూరు చేసామని, రామగుండం ఎమ్మెల్యే చోరవతో నైపుణ్య కేంద్రం త్వరలో ఏర్పాటు రామగుండంలో జరుగుతుందని అన్నారు. రామగుండంలో ఉన్న సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్.ఎఫ్.సి.ఎల్ వంటి పరిశ్రమల అనుసంధానం చేసే విధంగా చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎం.ఎస్.ఎం.ఈ పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
జిల్లాలో సాగునీటికి, త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎక్కడ త్రాగునీటి ఇబ్బందులకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని, మహిళలకు అందించే రుణాలతో వారు ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని, బహుళ జాతి కంపెనీలతో పోటీపడే విధంగా మహిళా సంఘాలు రాణించాలని మంత్రి ఆకాంక్షించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న పాఠశాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించే కార్యక్రమం అమ్మ కార్యక్రమం క్రింద చేపడుతున్నామని అన్నారు. గతంలో మహిళలను లక్షాధికారులను చేస్తామని చెప్పామని, ప్రస్తుతం మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని తాము చేసిన పోరాటాలు, ఒత్తడి ఫలితంగా గత ప్రభుత్వం సింగరేణి సంస్థ ద్వారా రామగుండంలో వైద్య కళాశాల పనులు చేపట్టిందని అన్నారు. రామగుండంలోని వైద్య కళాశాలకు అధునాతన ఆసుపత్రి ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రత్యేక చోరవ తీసుకుని 142 కోట్లతో 355 అదనపు పడకల ఆసుపత్రి భవనం మంజూరు చేయడం జరిగిందని, దీనికి మరిన్ని నిధులు మంజూరు చేసి సూపర్ స్పెషాలిటీ వసతులు సైతం ఇక్కడి ప్రజలకు కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.