కరీంనగర్,జనతా న్యూస్: ప్రభుత్వం మీపై పెద్ద బాధ్యత పెట్టింది.. పాఠశాలలను బాగు చేసే అవకాశాన్ని మీకిచ్చింది.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. ముందుండి నిలబడి పాఠశాలల్లో పనులన్నీ పూర్తి చేయించాలని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గురువారం గంగాధర మండలం రంగారావుపల్లి, ఆచంపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన మరమ్మత్తు పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో పనులన్నీ మన్నికగా ఉండేలా నాణ్యతతో చేపట్టాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ముందుండి పనులన్నీ పూర్తి చేయించాలని సూచించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా టాయిలెట్స్, ఇతర మరమ్మత్తు పనులన్నీ జూన్ 12 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల భవనాలకు సంబంధించిన ప్లాస్టరింగ్ నాణ్యతతో చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. అదేవిధంగా పాఠశాలల్లో ఉన్న పాత సామాగ్రిని స్థానికంగానే విక్రయించాలని సూచించారు. అధికారులు కూడా పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వినయ్ కుమార్, ఎంపీడీవో రాము, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జూన్ 12 లోపు పనులన్నీ పూర్తి కావాలి
- Advertisment -