1835 వ్యాధులకు ఉచిత చికిత్స..
ఇందులో 1375 రకాలకు ప్యాకేజీ పెంపు
రూ. పది లక్షల వరకు వర్తింపు…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో..
50 ఆసుపత్రుల్లో వైద్య సేవలు
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారా..? ప్రయివేటు ఆసుపత్రిలో ఖరీదైన చికిత్సకు డబ్బుల్లేవని ఇబ్బందులు పడుతున్నారా..? ఏ మాత్రం సందేహించకండి! ప్రభుత్వ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందే సులభతరమైన వెసులుబాటు ఉంది. ఇటివల కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఉచిత వైద్య సేవలను రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు పెంచింది. దీంతో పాటు కొత్తగా 163 కొత్త చికిత్స లను ఇందులో చేర్చింది. వీటివల్ల సర్జరీ , మెడికల్ మేనేజ్‌మెంట్ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా 1835 రకాల వ్యాధులకు చికిత్స పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రయివేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో చికిత్సల ప్యాకేజీ ఛార్జీలు పెంచడం వల్ల..మెరుగైన వైద్య సేవలు పొందవచ్చు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 50 ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం..వెంటనే ఆయా ఆసుపత్రుల సేవలను వినియోగించుకోండి.
రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు పొందేందుకు ఎక్కువ మంది రోగులు ముందుకు రావడం లేదు. గతంలో తక్కువ ప్యాకేజీలు ఉండడం వల్ల ప్రయివేటు, కార్పోరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు పేదలకు చికిత్స అందించేందుకు నిరాకరించే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. మార్కెట్‌లో పెరిగిన ధరలకు అనుగుణంగా ఆరోగ్య శ్రీ లోని చికిత్స లకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్యాకేజీలు పెంచడంతో..రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులు ముందుకొస్తున్నాయి . కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స పొందే రోగుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది.
ఉమ్మడి జిల్లాలో 50 ఆసుపత్రులు..
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 50 ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రయివేటు 33, ప్రభుత్వ ఆసుపత్రులు 17 ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 27 ఆసుపత్రులు, జగిత్యాల జిల్లాలో 12, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో ఐదేసి చొప్పున ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ప్రతిమ, చల్మెడ మెడికల్ కాలేజీలతో పాటు డాక్టర్ భూంరెడ్డి, ఆపోలో రీచ్, సూర్య నర్సింగ్ హోం, సీవీఎం..జగిత్యాలలో అమృత త్రినేత్ర, రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అశ్విని ప్రయివేటు ఆసుపత్రుల్లో ఎక్కువ వ్యాధులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
ఖరీదైన వ్యాధులకూ చికిత్స..
ఖరీదైన వ్యాధులకు సైతం ఆరోగ్య శ్రీ పథకంలో పేద రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రధానంగా గుండె సంబంధిత సర్జరీల ప్యాకేజీలు భారీగా పెరిగాయి. గతంలో రూ. 70 వేల ఉన్న సర్జరీ ఇప్పుడు రూ. లక్షా 8100, గ్యాస్ట్రో లివర్ ఇంజ్యూరీ రూ. 1.50 లక్షల వరకు, న్యూరో విభాగంలో బ్యాటరీ రీ ప్లేస్‌మెంట్ రూ. 5 లక్షలు, స్టీమిలైజేషన్‌కు రూ. 13 లక్షల వరకు ..ఆసుపత్రులకు చెల్లించేలా ప్యాకేజీలను పెంచింది సర్కారు. ఇలా 1375 రకాల వ్యాధుల ప్యాకేజీలను పెంచడంతో..పేదలకు చికిత్స అందించేందుకు ప్రయివేటు, కార్పోరేట్ ఆసుపత్రులు ముందుకొస్తున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట లోని రిషిక చిల్డ్రెన్ ఆసుపత్రిలో పిల్లలకు ఖరీదైన చికిత్స ఆరోగ్య శ్రీ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఇలా మరిన్ని ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ పథకం లో వైద్య సేవలు అందించే అవకాశాలున్నాయి.
ఆరోగ్య శ్రీ సేవలు వినియోగించుకోండి
విజయ్ కుమార్, జిల్లా మేనేజర్, ఆరోగ్య శ్రీ
పేదలు రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు వినియోగించుకోవాలి. ప్రయివేటు, కార్పోరేట్, మెడికల్ ఆసుపత్రుల్లో ఆరోగ్య మిత్రలు అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదిస్తే..పూర్తి వివరాలు చెబుతారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తరుపున అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. అత్యవసర పరిస్థితుల్లో రేషన్ కార్డు లేక పోయినా సరే..రోగి తీవ్రత, ఆర్థిక పరిస్థితులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందేలా కృషి చేస్తాం. పేదలు ప్రయివేటు ఆసుపత్రుల్లో డబ్బులు వృథా చేసుకోకుండా..ఆరోగ్య శ్రీ పథకంలో వర్తించే వ్యాధులకు చికిత్స చేయించుకుని ఆదా చేసుకోవాలని కోరుతున్నా.