కేసీఆర్ దశమ గ్రహం..
తెలంగాణ ప్రజలకు పీడ విరగడైంది..
స్వార్ధం కోసమే నవగ్రహ యాగం
సచివాలయ డోమ్ ను కూల్చకపోతే ఏం చేస్తాం?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్ :
తెలంగాణలో వరదల వల్ల నష్టం సంభవించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు తప్పకుండా సాయం అందిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్ఫష్టం చేశారు. హైదరాబాద్ సచివాలయంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మలనాగేశ్వరరావు లతో సీఎం సమావేశం నిర్వహించారు. అంతకు ముందు కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధాని ఆదేశాలతో శివరాజ్ సింగ్ ఆధ్వర్యంలో తాము రాష్ట్ర మంత్రులతో కలిసి ఖమ్మంలో పర్యటించామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సచివాలయంలో డోమ్ లను కూల్చేస్తామని గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని చెప్పిన బండి సంజయ్… 9 అంతస్తుల సచివాలయంలో 3 అంతస్తుల మేర డోమ్ లను నిర్మించడమేందని ప్రశ్నించారు. అధికారులకు, సిబ్బందికి సరైన స్థలం, సదుపాయాలు కూడా సచివాలయంలో లేవని చెప్పారు. కేసీఆర్ నవగ్రహ యాగం చేయడంపైనా తనదైన శైలిలో బండి సంజయ్ స్పందించారు. ‘‘కేసీఆర్ దశమ గ్రహం. తెలంగాణ ప్రజలకు దశమ గ్రహం పీడ విరగడమైంది. పదేళ్లు కేసీఆర్ సహా ఆయన కుటుంబమంతా అధికారం అనుభవించింది కదా.. ఇంకా దేనికోసం నవగ్రహం యాగం చేస్తున్నట్లు’’అని వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారం రాష్ట్రానికి సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఎన్ని నిధులివ్వాలనే అంశంపై వాస్తవ అంచనాల ఆధారంగా, నిబంధనల మేరకు కేంద్రం కచ్చితంగా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. గతంలో కేసీఆర్ ఏనాడూ ఇట్లాంటి ఆపత్కాలం వచ్చినప్పుడు కేంద్ర మంత్రులను పిలవలేదని, కేంద్రం అందించిన సాయం కూడా వాడుకోలేదని, ఎస్డీఆర్‌ఎఫ్ నిధులే ఇందుకు నిదర్శనం నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు ‘నో ఎంట్రీ’బోర్డు పెట్టారని, ఎన్ని యాగాలు చేసినా ఫలితం ఉండదన్నారు. రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారని, వరదలతో తీవ్రంగా నష్టపోయారని, కనీసం ప్రజల కోసమైనా యాగాలు చేస్తే బాగుండేదని ఎద్దేవ చేశారు. ి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీని వీడి వలస పోతున్నరనే భయం పట్టుకుందని, అందుకే తాను గంప కింద కమ్మిన ఎమ్మెల్యేలెవరూ బయటకు వెళ్లకూడదనే స్వార్ధంతో కేసీఆర్ యాగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు బండి సంజయ్.
నిబంధనల మేరకు కేంద్రం సాయం

- Advertisment -