పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ తర్వాత మంత్రివర్గ విస్తరణ?
హుజురాబాద్, జనత న్యూస్: పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక పాలనపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 4 న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ పూర్తికావడంతో… ఎన్నికల కోడ్ కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు చోటుదక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. వెంకట్ రాష్ట్ర ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షునిగా పనిచేసారు. గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వంపై విద్యార్థి సమస్యలపై పోరాడారు. వెంకట్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం, విద్యార్థుల సమస్యలపై అయన గళమెత్తారు. ఈటల రాజేందర్ నాడు బీ ఆర్ ఎస్ నుండి బయటకు వచ్చి రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికలో వెంకట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటికే ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసారు. దీంతో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా వెంకట్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు. కాగా బీ ఆర్ ఎస్ ప్రభుత్వంపై నాడు అలుపెరుగని పోరాటం జరిపిన బల్మూరి వెంకట్ కు మంత్రి పదవి వస్తుందని, ఆయనకు క్రీడలు, యువజన సర్వీసులు ఇచ్చే అవకాశం ఉందని హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. వెంకట్ కు ఢిల్లీ పెద్దల, అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయని, సి ఎం రేవంత్ తోనూ మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. వెంకట్ కు మంత్రి పదవి ద్వారా ఇటు యూత్, విద్యార్ధి కోటాతో పాటు ఎన్ ఎస్ యూ ఐ కి ప్రాతినిధ్యం ఇచ్చినట్లు అవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్వ కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇద్దరు మంత్రులు గా ఉండగా.. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విప్ గా ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం తారిపల్లి వెంకట్ స్వగ్రామం. కాగా హుజురాబాద్ నియోజకవర్గంలో వెంకట్ కు బంధు వర్గం ఉంది. వెంకట్ కు మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న వార్తల నేపథ్యంలో హుజూరాబాద్లోని అయన అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది.