Thursday, July 3, 2025

గురి తప్పని బాణం ‘పొంగులేటి’

 

(యాంసాని శివకుమార్-ఎడిటర్)

 దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే శ్వాస కూడా మరణం కంటే భయంకరంగా ఉంటుందని ఓ సినీ రచయిత రాసిన మాటలు నిజ జీవితంలో నిజమయ్యాయి. ఎన్నికల ముందు వరకు ఓ శిఖరంలా ఉన్న కేసీఆర్‌ని తొడగొట్టి పడగొట్టిన ఘనత ఒక్క పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికే దక్కిందంటే అతిశయోక్తి కాదేమో.. అధికారం, అంగబలంతో అణగదొక్కడానికి ఎంత ప్రయత్నం చేసినా, బెదిరింపులు, అవమానాలకు సైతం రవ్వంతైనా జంకకుండా, రాజకీయ చదరంగంలో వేగంగా పావులు కదుపుతూ, ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, చివరికి గురితప్పకుండా బాణం వేసిన అర్జునుడిలా నిలబడటంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి..

సవాల్‌ చేసి పడగొట్టిన ఘనుడు

ఖమ్మం జిల్లాలో ఒకేఒక్కడు..’పొంగులేటి’
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసే ఏ ఒక్క బీఆర్‌ఎస్‌ అభ్యర్థినీ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. ఈ జిల్లాలోని పదికి పది స్థానాలను కాంగ్రెస్‌ పార్టీనే కైవసం చేసుకుంటుంది. ఈ చాలెంజ్‌ను ఎవరికి.. ఎవరి చేశారో తెలుసా.. చావు అంచుల్లోకి వెళ్లి మరీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి.. తెలంగాణను పదేళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన రాజకీయ చాణక్యుడు కేసీఆర్‌కు ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చేసిన చాలెంజ్‌ ఇది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిన ఈ చాలెంజ్‌ను పొంగులేటి దాదాపు నిలబెట్టుకున్నారనే చెప్పాలి. కేసీఆర్‌ ఎదుట నిలబడి మాట్లాడేందుకే భయపడే నాయకులు.. ఏకంగా ఆయనకే సవాల్‌ చేయడం.. ఆ సవాల్‌ను నిలబెట్టుకోవడం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. నిన్నామొన్నటి వరకూ తెలంగాణలో ఎదురులేని శక్తిగా నిలిచిన కేసీఆర్‌ చరిష్మా ఒక్క రోజులోనే మసకబారిపోయిందంటే…. ఆ శక్తి ఓటు అనే వజ్రాయుధానికి ఉన్న శక్తి. దాన్నే ప్రజల శక్తి అనొచ్చు. రాజకీయాల్లో ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి.. అనే నానుడిని ఈ సంఘటన రుజువు చేసింది. కేసీఆర్‌కే సవాల్‌ చేసి.. ఆ సవాల్‌ను నిలబెట్టుకున్న పొంగులేటి రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది.. ఆయన ఎవరి అండదండలతో ఈ స్థాయికి ఎదిగారు.

కాంట్రాక్టర్‌గా పరిచయం

ఒక బడా కాంట్రాక్టర్‌గా మాత్రమే కొందరికి పరిచయం ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి 2014 ఎన్నికల సమయంలో రాజకీయ అరంగేట్రం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో అందరూ టీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపారు. పొంగులేటి మాత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఖమ్మం ఎంపీగా పోటీ చేయడమే కాదు.. ఘన విజయం సైతం సాధించారు. ఆయన విజయంలో పార్టీకి ఉన్న గుర్తింపు కంటే.. వ్యక్తిగత చరిష్మా పని చేసిందని అందరూ చెప్పుకుంటారు. అయితే.. ఎంపీగా గెలిచిన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. నాటి రాజకీయ సమీకరణాల్లో భాగంగా పొంగులేటి కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ.. 2018 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ టికెట్‌ను పొంగులేటికి కాకుండా.. నామా నాగేశ్వరరావుకు ఇచ్చారు. దీంతో కంగుతిన్నప్పటికీ నాడు మౌనం వహించిన పొంగులేటి.. తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. బీజేపీకి వెళ్లాలనుకున్న పొంగులేటి అభిమానుల సలహా మేరకు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేని శక్తి

కాంగ్రెస్‌లో చేరడంతోనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంతృప్తి చెందలేదు. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేస్తూ.. హస్తం పార్టీని గెలిపించుకున్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టుకున్నారు. ఉమ్మడి ఖమ్మంలో తన సత్తాను పార్టీ అధిష్టానానికి చూపాలనుకున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అనుకున్నంతా పని చేసి చూపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ గెలిచిన ఏకైక స్థానం భద్రాచలం. అక్కడ గెలిచిన తెల్లం వెంకట్రావు కూడా పొంగులేటి అనుచరుడే. పొంగులేటితో పాటు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కానీ.. భద్రాచలం సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకే కాంగ్రెస్‌ మళ్లీ టికెట్‌ ఇస్తుందని తెలుసుకున్న తెల్లం.. వెంటనే బీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసి.. ఆ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. మొత్తానికి పొంగులేటి లెక్క ఒక్క సీటుతో తప్పినా.. లక్ష్యం మాత్రం గురితప్పలేదని చెప్పవచ్చు.

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యలో ..

పొంగులేటి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో 1965 నవంబర్‌ 4వ తేదీన జన్మించారు. కల్లూరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేసిన పొంగులేటి ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యలో బీఏ డిగ్రీ చేశారు. అనంతరం కాంట్రాక్టర్‌ అవతారం ఎత్తి.. 1985లో ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు గ్రామోదయ పథకంలో పేరువంచ మేజర్‌పై క్రాస్‌ వాల్‌ నిర్మించారు. ఆ క్రాస్‌వాల్‌ నిర్మాణంతో 450 ఎకరాల భూమి సాగులోకి రావడంతో పొంగులేటికి స్థానికంగా గుర్తింపు వచ్చింది. అనంతరం ప్రభుత్వం తరఫున పలు నిర్మాణాలు చేపట్టి బడా కాంట్రాక్టర్‌గా అవతరించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరి వివిధ హోదాల్లో పని చేశారు. 2013లో వైఎస్సార్‌ సీపీలో చేరి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో ఖమ్మం లోక్‌సభ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు.

సీఎం కేసీఆర్‌కే సవాల్‌

ఏకంగా సీఎం కేసీఆర్‌కే సవాల్‌ చేస్తే ఆ పెద్దాయన ఊరుకుంటారా.. పొంగులేటిని ఆర్థికంగా దెబ్బ తీసేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేయించారు. ఖమ్మంలోని ఆయన నివాసంతో పాటు పాలేరులోని క్యాంపు కార్యాలయంలో సోదాలు చేపట్టారు. అయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి తన వంతు ప్రయత్నం చేసి సక్సెస్‌ అయ్యారు. తన కుటుంబానికి ఏకంగా 434 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో పొంగులేటి పేర్కొన్నారు. ఆర్థికంగా బలంగా ఉండటం వల్లే పొంగులేటి.. కేసీఆర్‌కు సవాల్‌ చేశారని.. సక్సెస్‌ కూడా అయ్యారని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page