కరీంనగర్, జనతా న్యూస్: మద్రాసు రాజ్యంలో ఉన్న తెలుగువారి కోసం ప్రత్యేకంగా రాష్ట్రం కావాలనే పట్టుదలతో ఆమరణ నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు గురించి ఎవరూ మరిచిపోరు. మహాత్మగాంధీ సత్యం, అహింస అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన ఆయన తెలుగు వారి కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. ఆయన దీక్ష కారణంగా 1952 డిసెంబర్ 19న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అయితే కొన్ని ప్రాంతాల్లో కొందరు పొట్టి శ్రీరాములు విగ్రహాలను ధ్వంసం చేశారు. కానీ ఆయన చేసిన కృషి తోనే నేడు ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారన్న విషయం మరిచిపోవద్దు.. అని పొట్టి శ్రీరాములు పేరిట వెలిసిన ఫౌండేషన్ బాధ్యులు అంటున్నారు. మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతి. ఈసందర్భంగా ఆయన గురించి వివరాల్లోకి వెళితే..
పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసులోని అన్నా పిళ్లైలో జన్మించారు. చిన్నప్పటి నుంచే దేశ భక్తి కలిగిన ఆయన తెలుగువారి కోసం ప్రత్యేకంగా రాష్ట్రం కావాలని తపించేవారు. ఈ నేపథ్యంలో 1952 అక్టోబర్ 19న బలుసు సాంబమూర్తి ఇంట్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. అయితే అప్పటి నెహ్రూ ప్రభుత్వం మాత్రం పొట్టి శ్రీరాములు దీక్షపై స్పందించలేదు. కానీ ప్రజల్లో మాత్రం చైతన్యం వచ్చింది. ఈ క్రమంలో ఆయన 1952 డిసెంబర్ 15న అర్ధరాత్రి దీక్ష చేస్తూ ప్రాణాలను వదిలాారు. దీంతో మద్రాసులో ఒక్కసారిగా తెలుగువారి ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఆందోళనలు, హింసా వాతావరణం ఏర్పడింది. దీంతో డిసెంబర్ 19న అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
పొట్టి శ్రీరాములు విగ్రహం పున ప్రతిష్ట చేయాలి:
తెలుగువారి కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములును ఎవరూ మరిచిపోవద్దని ఆయన పేరిట వెలిసిన పౌండేషన్ రూపకర్తలు అంటున్నారు. గత ప్రభుత్వంలో కొందరు ఆయన విగ్రహాలు ధ్వంసం చేశారని, తిరిగి ఆయన విగ్రహాలను పునర్నిర్మించాలని కోరుతున్నారు. కరీంనగర్లోని గణేశ్ నగర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల రామేశం ఈ మేరకు వారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వినతిని సమర్పించిన ప్రకటనను విడుదల చేశారు.
హైదరాబాద్ లోని పాత సచివాలయం ఎదుట ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కొందరు తొలగించారని తెలుసుకొని ఆయన అభిమానులు తీవ్ర నిరాశ చెందారన్నారు. తెలుగు వారి త్యాగానికి ప్రతీకగా నిలిచే ఆయన గాంధీ పిలుపు మేరకు రైల్వేలోని తన ఉద్యోగాన్ని వదులుకొని పలు మార్లు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. అలాగే జైలు శిక్ష అనుభవించారన్నారు. పొట్టిశ్రీరాములు చేసిన త్యాగానికి ప్రతీకగా 2002లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాత సచివాలయం ఎదుట ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారన్నారు. కానీ ఆ తరువాత ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. మరోసారి ఆయన విగ్రహాన్ని పున ప్రతిష్టించాలని ఈ సందర్భంగా వారు కోరారు.