‘గొలుసు కట్టు’ మోసాలకు ఓ తండ్రితో సహా ముగ్గురు కుమారులు బలయ్యారు. హైదరాబాద్ శివారులో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని టంగుటూరు గ్ామానికి చెందిన నీరటి రవి – శ్రీలత దంపతులకుముగ్గురు సాయి కిరణ్, మోహిత్ కుమార్, ఉదయ్ కిరణ్ అనే ముగ్గురు కుమారులున్నారు. రవి ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే రెండేళ్ల కిందట ఉద్యోగంలో భాగంగా ఏపీలోని గుంటూరుకు వెళ్లిన అతనికి జీఎస్ఎన్ ఫౌండేషన్ ప్రతినిధి తిరుపతి రెడ్డి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో తిరుపతి రెడ్డి తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని రవితో చెప్పడంతో ఆకర్షితుడయ్యాడు. దీంతో రవి తాను మాత్రమే కాకుండా తమకు తెలిసిన వారితో పెట్టుబడులు పెట్టించాడు. అయితే ముందుగా కొన్ని రోజులు లాభాలు వచ్చాయి. కానీ గత మూడు నెలలుగా ఈ సంస్థ నష్టాలను ఎదుర్కొంటోంది. దీంతో రవి ద్వారా పెట్టుబడి పెట్టిన వారు ఆయనపై ఒత్తిడి చేశారు. దీంతో ఆయన టంగటూరు నుంచి హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లికి నివాసాన్ని మార్చాడు.
ఈ క్రమంలో ఈ విషయంపై భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఆదివారం ఉదంయ చిన్న కుమారుడు ఉదయ్ కిరణ్ ను వెంటబెట్టుకొని మెయినాబాద్ మండలం చిల్కూరుకు వెళ్లాడు. అక్కడున్న సాయికిరణ్, మోహిత్ కుమార్ లను వెంటబెట్టుకొని రాత్రి 10.30 గంటలకు భార్యకు ఫోన్ చేశాడు. తనని పుట్టింటికి వెళ్లిపోవాలని చెప్పి టంగుటూరుకు వెళ్లాడు. అర్ధరాత్రి నిద్రపోతున్న కుమారులను తాడుతో ఉరివేసి చంపి ఆ తరువాత తాను నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ కు వెళ్లి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. డబ్బులు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో రవి తన కుమారులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.