Saturday, July 5, 2025

రుణమాఫీ సర్వే 90 శాతం పూర్తి

జిల్లాలో 13,500 రైతుల వివరాలు అప్‌లోడ్‌
మూడో విడుత నిధుల కోసం ఎదురు చూపు
రూ. 2 లక్షలకు పైబడ్డ వారికి మరింత ఆలస్యం
జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి
పంట రుణమాఫీ ప్రక్రియ ఆలస్యమౌతోంది. సాంకేతిక కారణాలు, నిధుల లేమితో పూర్తిస్థాయి రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. ఇప్పటికే మూడు విడుతలుగా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం..రూ. 2 లక్షల లోపు పెండిరగ్‌లో ఉన్న లబ్ధిదారులకు నాలుగో విడుతగా నిధులు విడుదల చేయనుంది. ఇందులో భాగంగా కరీంనగర్‌ జిల్లాలో ఇప్పటికే 90 శాతం వరకు ఫ్యామిలీ గ్రూపింగ్‌ సర్వే పూర్తి అయింది. మరో ఐదు శాతం సర్వే పూర్తయ్యే అవకాశాలున్నాయి. మూడు విడుతల్లో జిల్లాలోని 71, 109 మంది రైతులకు రూ. 546. 36 కోట్లు గతంలో విడుదల చేయగా..నాలుగో విడుతగా సుమారు 14 వేల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేయనుంది.
90 శాతం సర్వే పూర్తి
పంట రుణమాఫీ ఫ్యామిలీ గ్రూపింగ్‌ సర్వే చివరి దశకు చేరుకుంది. గత మూడు విడుతల్లో సాంకేతిక, ఇతర కారణాల వల్ల రూ. 2 లక్షల లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ కాక పోవడంతో, వారి నుండి ఫిర్యాదులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్‌ 4 వరకు ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు..రైతుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించి, తప్పులను సవరిస్తూ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్‌ జిల్లాలో 15 వేల మంది రైతుల్లో ఇప్పటి వరకు 13, 500 మంది రైతు కుటుంబాలను వ్యవసాయ అధికారులు కలసి తప్పులను సవరించి యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. మరో ఐదు శాతం మాత్రమే సర్వే చేసే అవకాశాలున్నాయి.
ఇవీ నిబంధనలు..
2018 డిసెంబరు 12 తేదీ నుండి 2023 డిసెంబర్‌ 9నాటికి రెన్యూవల్‌ అయిన, రైతులు బకాయి ఉన్న అసలు, వడ్డీ మాఫీ చేస్తుంది సర్కారు. కుటుంబానికి ఒకరికే ఈ రుణమాఫీ వర్తించేలా రేషన్‌ కార్డు డాటా బేస్‌ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లోని పంట రుణాలను మాఫీ వర్తిస్తుంది. 2023 డిసెంబర్‌ 12 నాటికి రైతు తీసుకున్న బ్యాంకు అప్పురూ. రెండు లక్షల కంటే ఎక్కువగా ఉంటే .. ఆ పైన ఉన్న అప్పును రైతు తొలుత బ్యాంకుకు రైతు చెల్లించిన తరువాతే రుణమాఫీ వర్తిస్తుంది. తొలుత రెండు లక్షల లోపున్న రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసి, ఆ తరువాత రూ. 2 లక్షలపైన రుణాలున్న రైతుల రుణాలను మాఫీ చేయనుంది సర్కారు.
ఇప్పటి వరకు రూ. 2లక్షల లోపు రుణమాఫీ
రూ. లక్ష లోపు రుణాలున్న రైతులకు జూలై 18న తొలి విడుత రుణమాఫీ చేపట్టింది సర్కారు. కరీంనగర్‌ జిల్లాలో 38, 894 మంది రైతులకు రూ. 201.46 కోట్లు మాఫీ అయింది. 30న రెండో విడుతలో రూ. లక్షన్న రుణాలున్న 19, 420 మంది రైతులకు రూ. 182.44 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 15న మూడో విడుతలో రూ. 2 లక్షల వరకు రుణాలున్న 12, 795 మంది రైతులకు రూ. 162.46 కోట్ల రుణమాఫీ జరిగింది. ఇలా మూడు విడుతల్లో ఇప్పటి వరకు 71, 109 మంది రైతులకు రూ. 546. 36 కోట్ల రుణమాఫీ ద్వారా లబ్ధి చేకూరింది.
నాలుగో విడుత కోసం ఎదురు చూపు
దసర వరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల లోపు పెండిరగ్‌ రుణమాఫీ చేసే అవకాశాలున్నాయి. దీనివల్ల కరీంనగర్‌ జిల్లాలోని సుమారు 14 వేల మంది రైతులకు మేలు జరుగనుంది. అన్ని అర్హతలున్నా రుణమాఫీ కాక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. పలు సందర్భాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులకు తమ గోడును వెల్లబోసుకున్నారు. దీంతో ప్రభుత్వంపై సదరు ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. కాగా..రూ. 2 లక్షలకు పైగా రుణాలున్న రైతులకు రుణమాఫీ కొంత ఆలస్యమయ్యే అకాశాలున్నాయి. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన అతివృష్టి వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. బాధితులకు పరిహారం కూడా చెల్లించాల్సి ఉంది. నిధుల కొరత కారణంగా రూ. 2 లక్షల పైబడ్డ రైతు రుణమాఫీ ఆలస్యమం అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page