18 ఏళ్లు నిండిన మహిళలకు కానుక..
సమాలోచనలో రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టు వైరల్
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
మహిళలలకు పెద్దపీట వేస్తోంది కాంగ్రెస్ సర్కారు. మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలెండర్‌తో పాటు మహిళా శక్తి పథకం ద్వారా స్వయం ఉపాధికి ఊతమిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కాగా.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సద్దుల బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేయగా..ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నగదు బహుమతి ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం విస్తృత ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వం నాసిరకం చీర పంపిణీ చేసిందని..తమ ప్రభుత్వం నగదు పంపిణీ చేయబోతున్నట్లు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం వైరల్ చేయడం ప్రధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం సద్దుల బతుకమ్మ పండుగకు మహిళలకు నగదు కానుక అందించనున్నట్లు సమాచారం. 2017 నుండి 2023 వరకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతీ సద్దుల బతుకమ్మ పండుగకు మహిళలకు చీర కానుకగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సద్దుల బతుకమ్మ పండుగకు చీరకు బదులుగా నగదు పంపిణీ చేయాలని యోచిస్తోంది. ఇందుకు కుటుంబంలో ఒకరికా లేదా 18 ఏళ్లు నిండిన మహిళలందరికా అనేది తేలాల్సి ఉంది. ఎంత మొత్తంలో నగదు పంపిణీ చేయనుందనే దానిపై ఇప్పటి వరకు అంచనాకు రాలేనట్లు సమాచారం. అయితే..దీనిపై కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం మాత్రం విస్తృత ప్రచారం చేస్తుంది. ‘నాడు నాసిరకం చీరల పంపిణీ`కమీషన్ల దోపిడీ’..నేడు ఆడబిడ్డలకు నగదు ఇచ్చేందుకు ప్లాన్, నేరుగా ఖాతాల్లో లేదంటే చేతికి డబ్బు’ పేరుతో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం సమాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తుంది.
గతంలో చీరల ఉత్పత్తి, పంపిణీకి రూ. 350 కోట్లు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలతో పవర్ లూమ్‌లపై ఉత్పత్తి చేయించి, బతుకమ్మ పండుగ కానుకగా చీరలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. గతంలో చీరకు రూ. 250లోపు ఖర్చు అయ్యేది. అయినా..నాసిరకం చీరలు పంపిణీ చేశారని, వాటిని ఎక్కువ మంది మహిళలు వినియోగించుకోలేక పోయారు . పైగా అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి ప్రభుత్వం ఏటా రూ. 350 కోట్ల వరకు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అసెంబ్లీలో సైతం ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. సద్దుల బతుకమ్మ పండుగకు మహిళలకు సెంటిమెంట్‌గా భావించే చీరకు బదులుగా నగదు చెల్లించేలా కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. గత ప్రభుత్వానికి మించి కానుక ఇవ్వాలంటే కనీసం ఒక్కొక్కరికి రూ. 500 రూపాయలైనా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి రూ. 500 కోట్ల వరకు కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపు, విధి విధానాలు తదితర అంశాలపై కొద్ది రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
బతుకమ్మ పండుగకు నగదు పంపిణీ ?

- Advertisment -