ప్రకాష్ నగర్ బ్రిడ్జి పునరుద్ధరణకు 100 రోజులు..
రిటైనింగ్ వాల్ నిర్మాణానికి డిజైన్..
వరద ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు..
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
ఖమ్మం-జనత న్యూస్
జాతీయ రహదారులతో ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు, ఓఆర్‌ఆర్, సర్వీస్ రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కుంభవృష్టితో వచ్చిన వరదల కారణంగా ఖమ్మం జిల్లా తీవ్రంగా దెబ్బతిందని, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టి సాధారణ పరిస్థితులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. విద్యుత్తు, త్రాగునీటి సరఫరా మొదలగు వసతులను వేగవంతంగా పునరుద్దరించినట్లు తెలిపారు.
వరదల కారణంగా ప్రకాష్ నగర్ బ్రిడ్జి యధాస్థితి కోల్పోయి పక్కకు జరిగిందని , పిల్లర్లకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినా స్లాబ్ పక్కకు జరిగిందన్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రితో మాట్లాడి వైజాగ్ కు చెందిన నిపుణుల కమిటీతో పరిశీలన జరిపామని, బ్రిడ్జిలో మొత్తం 24 స్పాన్ లలో 9 పక్కకు జరిగాయని, హై లెవెల్ కమిటీ సమావేశంలో ఈ పనులను సంబంధిత కాంట్రాక్టర్లకు అప్పగించామని, దీని పునరుద్ధరణకు మరో 100 రోజుల సమయం పడుతుందని మంత్రి తెలిపారు. మున్నేరు నది చరిత్రలో 42 అడుగులు వరద వచ్చినా రికార్డు లేదని, దీనికి అనుగుణంగా నిపుణుల కమిటీ ఇచ్చే రిటైనింగ్ వాల్ రీ డిజైనింగ్ చేయిస్తున్నామని మంత్రి తెలిపారు. ఖమ్మం నగరంలోకి వచ్చిన డ్రైయిన్ నీరు మళ్లీ నదిలోకి వెళ్లేలా సర్వే చేస్తున్నామని అన్నారు. రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులతో ఖమ్మం కోదాడ 31 కిలోమీటర్ ల జాతీయ రహదారి పూర్తి చేసామని, అదే విధంగా ఖమ్మం, దేవరపల్లి జాతీయ రహదారి ఉగాది వరకు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, అమరావతి జాతీయ రహదారి, సూర్యాపేట, ఖమ్మం, రాజమండ్రి జాతీయ రోడ్ల మధ్యలో 6 కిలో మీటర్ల మిగులుతుందని, దీనిని కూడా రూ.120 కోట్లు మంజూరు చేసి జాతీయ రహదారి అమరావతి రోడ్డుకు కలుపుతున్నామన్నారు. దీనితో ఖమ్మం నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు రూపు దిద్దుకుంటుందని అన్నారు. ఖమ్మం ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్లు భవనాల శాఖ పరిధిలోనే రూ. 750 కోట్ల నష్టం జరిగిందని, వీటిని తాత్కాలికంగా పునరుద్దించేందుకు రూ. 25 కోట్లు మంజూరు చేస్తామని, ఆయా పనులను వెంటనే పనులు చేపట్టి పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అత్యధిక జాతీయ రహదారులు ఉన్న జిల్లాగా ఖమ్మం ఆవిర్భవిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
లాభదాయక పంట ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని, 3 సంవత్సరాల తరువాత మంచి ఆదాయం వస్తుందని, 3 సంవత్సరాల వరకు అంతర్ పంటల ద్వారా ఆదాయం సమకూరుతుందని అన్నారు. ఆయిల్ పామ్ పంటకు ప్రభుత్వం తరపున భారీ స్థాయిలో సబ్సిడీ లభిస్తుందని, వీటిని రైతులు వినియోగించుకోవాలని అన్నారు. ఖమ్మం నగరంలో జరిగిన ఆక్రమణల తొలగింపుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. తెల్ల రేషన్ కార్డులేని రైతులకు రుణమాఫీ పథకం అమలు చేసేందుకు రైతు కుటుంబాల నిర్ధారణ సర్వే చేపట్టామని, దీని ప్రకారం అర్హులకు రుణమాఫీ పథకం వర్తింప చేస్తామని మంత్రి తెలిపారు. రెండు లక్షల పైన ఉన్న రైతులకు షెడ్యూల్ ఇస్తామని అన్నారు. వరద నష్టం క్రింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి సహాయం అందలేదని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ప్రతిపాదనలు సమర్పించామని అన్నారు. నదీ బేసిన్ పక్కన ఉన్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అర్బన్ లో అధికంగా ఇండ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఇర్రిగేషన్ సిఇ విద్యాసాగర్, ఆర్ ను బి సిఇ మోహన్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.
ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డు..

- Advertisment -