రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార మంత్రి పొంగులేటి
పాలేరు ఎడమ కాల్వ నీటి విడుదలపై పర్యవేక్షణ
కుసుమ-జనత న్యూస్
పాలేరు ఎడమ కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం హట్యా తండాలో పాలేరు ఎడమ కాలువ నీటి విడుదలపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ బాబు లతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..కాలువకు 150 మీటర్ల క్రింది వరకు పెద్ద గండి పడిరదని, యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చామని, క్రింద ఉన్న యూటి వాల్ నీటిలో ఉండటం వల్ల డ్యామేజ్ కావడం, దీనిని అధికారులు గ్రహించలేని నీటి విడుదల చేస్తే యూటి కూలిపోయిందని తెలిపారు. ఈ కారణాల వల్ల దిగువున ఉన్న రైతులకు సాగునీటి సరఫరా రెండు మూడు రోజులు ఆలస్యమైందన్నారు. యుద్ధ ప్రాతిపదికన గత 2 రోజుల నుంచి అధికార యంత్రాంగం ఇక్కడే ఉండి మరమ్మతు పనులు చేశారని మంత్రి తెలిపారు. మంగళవారం ఉదయం 500 క్యూసెక్కుల నుంచి మొదలు పెట్టి పెంచుకుంటూ మధ్యాహ్నం 1500 క్యూసెక్కుల వరకు నీటి విడుదల చేస్తున్నామని అన్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు పూర్తి స్థాయిలో 3200 క్యూసెక్కుల నీటి విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందిస్తామని అన్నారు. దేవుడి దయ వల్ల కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు పడ్డాయని, 2 పంటలకు సరిపడా సాగునీరు ప్రాజెక్టులలో ఉందని, ప్రభుత్వం చిత్తశుద్ధితో 2 పంటలకు నీళ్లు విడుదల చేస్తుందని అన్నారు. వరదల వల్ల వచ్చిన ఉపద్రవంతో ఆశించిన దాని కంటే రెండు, మూడు రోజులు సాగునీరు అందించడం ఆలస్యమైందని, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఇ విద్యాసాగర్, ఎస్‌ఇ నర్సింగ రావు, ఇఇ లు వెంకటేశ్వర రావు, అనన్య, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, అధికారులు పాల్గొన్నారు.
చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం

- Advertisment -