Saturday, July 5, 2025

గ్రేటర్‌ ప్రతిపాదనతో కాంగ్రెస్ బలం పెరిగేనా ?

కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ విస్తరణపై చర్చ
 ప్రభుత్వం ముందున్న సవాళ్లు..
నిశితంగా గమనిస్తున్న ప్రతిపక్షాలు..
సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ !
జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి

కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ విస్తరణపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ మరోసారి ప్రభుత్వానికి రాసిన లేఖపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని బొమ్మకల్‌, దుర్శేడ్‌, గోపాల్‌పూర్‌ లతో పాటు కొత్తపల్లి మండలంలోని చింతకుంట,మల్కాపూర్‌, లక్ష్మిపూర్‌ లతో పాటు కొత్తపల్లి మున్సిపల్‌ను సైతం కరీంనగర్‌ నగర పాలక సంస్థలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని మంత్రి కోరారు. దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతుండగా.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ చేపడుతుందా..లేదా..అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. స్వరాష్ట్రంలో తొలిసారి కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ను కైవసం చేసుకున్న అప్పటి అధికార టీఆర్‌ఎస్‌, 2019లో గ్రామాలను విలీనం చేసి మరోసారి విజయం సాధించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇతర పార్టీల కార్పోరేటర్లు సుమారు పది మంది కాంగ్రెస్‌లో చేరినప్పటికీ పెద్దగా బలం పుంజుకోలేదనే అభిప్రాయం వ్యక్తమౌతుంది. ఈ పరిస్థితుల్లో గ్రేటర్‌ కరీంనగర్‌ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ జెండా ఎగురేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.

కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ విస్తరణ మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రభుత్వానికి లేఖ రాయడం సర్వత్రా చర్చకు తెర లేపింది. ప్రస్తుతం మున్సిపల్‌ కార్పోరేషన్‌ 60 డివిజన్లు విస్తరించి ఉంది. మంత్రి సూచించినట్లు కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని బొమ్మకల్‌, దుర్శేడ్‌, గోపాల్‌పూర్‌ లతో పాటు కొత్తపల్లి మండలంలోని చింతకుంట,మల్కాపూర్‌, లక్ష్మిపూర్‌ లతో పాటు కొత్తపల్లి మున్సిపల్‌ను సైతం కరీంనగర్‌ నగర పాలక సంస్థలో విలీనం చేస్తే మరో 12 డివిజన్లకు పెరిగే అవకాశాలుంటాయి. దీంతో 72 డివిజన్ల వరకు విస్తరించడంతో పాటు గ్రేటర్‌ హోదా కూడా వస్తుందని పలువురు భావిస్తున్నారు. 2019లోనే గ్రేటర్‌ హోదాపై చర్చ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అప్పటి ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ, తగినంత జనాబా లేక పోవడంతో గ్రేటర్‌ ప్రకటనకు సాహసించలేక పోయింది.
ప్రభుత్వం ముందున్న సవాళ్లు..
కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ను విస్తరిస్తూ గ్రేటర్‌ గుర్తింపు ఇవ్వడం వల్ల కలిగే లాభాలపై అటు కాంగ్రెస్‌ పార్టీ, ఇటు ప్రభుత్వం విశ్లేషించనుంది. ఆయా ఆంశాలపై పూర్తి స్థాయి నివేదిక లను తెప్పించుకునే అవకాశాలున్నాయి. మరో ఆరు మాసాల్లో కార్పోరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ సాహసం చేస్తుందా..లేదా.. అనే చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ గాలి వీచినా, కరీంనగర్‌ అసెంబ్లీ నియోజక వర్గంలో మాత్రం బీఆర్‌ఎస్‌, బీజేపీ లకు మెజారిటీ ఓట్లు వచ్చాయి. 2020 గత మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక డివిజన్‌ను కూడా గెలుచుకోలేదు. అయితే ప్రస్తుతం ఇతర పార్టీ నుండి పది మంది కార్పోరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా పార్టీ పెద్దగా విస్తరించలేక పోయిందనే అభిప్రాయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
నిశితంగా గమనిస్తున్న ప్రతిపక్షాలు..
కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ విస్తరణ అంశంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపోటములపై అంచనాలు వేసుకుంటున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కరీంనగర్‌ కేంద్రంగా బీజేపీ సభ్వత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తు, రానున్న ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయా డివిజన్లలో బలమైన నేతల కోసం అన్వేశిస్తున్నారు. ఇటీవలే బీఆర్‌ఎస్‌ నుండి కార్పోరేటర్‌ కొండపల్లి సతీష్‌ బీజేపీలో చేరారు. కొత్తపల్లి మున్సిపల్‌లో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీపీ వాసాల రమేశ్‌తో పాటు కీలక నేతలు ఆ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో కరీంనగర్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పోరేటర్లు.. కొత్తపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌, కౌన్సిలర్లు పార్టీలోనే కొనసాగుతున్నారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికలపై ఇప్పటి నుండి అంతర్గతంగా ఆ పార్టీ అంచనాలు వేస్తుంది. పార్టీ గెలుపు కోసం వ్యూహాత్మంగా అడుగులు వేస్తుంది.
కాంగ్రెస్‌ సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ..
ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్‌ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆయా పార్టీల నేతలు. తక్కువ కాలంలో పార్టీ బలోపేతం చేయడం, ఇందుకు తగ్గ వ్యూహాల్ని అమలు చేసి రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించడం కాంగ్రెస్‌ ముందున్న సవాల్‌. సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ లతో పాటు ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబు తీసుకునే చొరవపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page