రోజుకు 180 మె.ట. ఉత్పత్తి
డంపింగ్ యార్డులో 3 లక్షల టన్నులకు పైగా నిల్వ
సవాల్‌గా మారిన నియంత్రణ
చేష్టలుడిన మున్సిపల్ యంత్రాంగం
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి వరకు ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమాలు చేపడుతోంది కేంద్ర సర్కారు. ఇందులో భాగంగా తెలంగాణలో అందులో కరీంనగర్ జిల్లాలోనూ వివిధ అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రతీ సంవత్సరం ఇలాంటి చక్కని కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన చేపడుతున్నాయి ప్రభుత్వాలు. ఇక్కడి వరకు భాగానే ఉన్నా..క్షేత్ర స్థాయిలో కార్యాచరణ చూపడం లేదనే దానికి కరీంనగర్ డంపింగ్ యార్డ్ చక్కని నిదర్శనం. నగర మధ్యన, మానేరు నదీ తీరాన సుమారు మూడు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుక పోవడం, దాని తొలగింపు చర్యలు చేపట్టక పోవడం పాలక వర్గాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. తడి`పొడి చెత్తను వేరు చేయడం, వ్యర్థాలను తగ్గించడం, సేంద్రీయ ఎరువు తయారీ..ప్రచార ఆర్భాటాలకే తప్ప కార్యచరణలో చూపిన దాఖలాలేవీ లేవు.
కరీంనగర్ నడీ మధ్యన, మానేరు తీరాన 8 ఎకరాల విస్తీర్ణలో ఉన్న డంపింగ్ యార్డ్ తొలగింపు సవాల్‌గా మారింది. రెండేండ్ల క్రితమే 2.5 లక్షల మెట్రిక్ టన్నులున్న చెత్త..ప్రస్తుతం మూడు నుండి నాలుగు లక్షల మెట్రిక్ టన్నులకు వరకు పేరుక పోయింది. ఇది తరచుగా తగలబడుతూ దట్టమైన దుర్వాసనతో కూడిన దట్టమైన పొగ నగరంలో విస్తరించడం సర్వ సాధారణంగా మారింది. సుమారు పది డివిజన్ల ప్రజలు దీనితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వస్తున్న చెత్తతో డంపింగ్ యార్డ్‌లో స్థలం లేక ఇక నిల్వచేందుకు తంటాలు పడుతున్నారు పారిశుధ్య సిబ్బంది. ఈ సమస్యను ఇప్పటి వరకు ఏ పాలక వర్గమూ సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు లేవు.
ఆటోల ద్వారా సేకరించడం వరకే..
నగరంలోని 60 డివిజన్ల నుండి స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా చెత్తను సేకరిస్తూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రతి ఇంటి నుండి నెలకు రూ. 60 వరకు వసూలు చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా..ఆయా నివాసాల నుండి తడి`పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం లేదు. దీనికి తోడు ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు సైతం అట్లే ఆటోలు, ట్రాక్టర్లలో పడేస్తున్నారు. ఇలా రోజుకు 180 మెట్రిక్ టన్నుల చెత్తను నేరుగా డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. ఈ లెక్కన ఈ రెండేండ్లలో సుమారు లక్షా 30 వేల మెట్రిక్ టన్నుల చెత్త పేరుక పోయినట్లు తెలుస్తుంది. అంతకు ముందున్న రెండున్నర లక్షల టన్నుల చెత్తకు ఇది అదనం.
నామ మాత్రంగా బయో మైనింగ్ ప్లాంట్..
2022 జూన్‌లో నగరంలోని డంపింగ్ యార్డ్‌లో చెత్త శుద్దీకరణకు బయో మైనింగ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఇందుకు స్మార్ట్‌సిటీ నిధుల నుండి రూ. 16.50 కోట్లు కేటాయించారు. ఇందుకు రెండు యంత్రాలు ఏర్పాటు చేసినా..పెద్దగా ఫలితం లేకుండా పోయింది. సంవత్సరంలోపే డంపింగ్ యార్డ్‌లోని చెత్త నిల్వలను పూర్తిగా శుద్ది చేయాల్సి ఉండగా..ఇప్పటి వరకు కనీసం 40 వేల మెట్రిక్ టన్నులు కూడా శుద్ధి చేయలేక పోయారు నిర్వాహకులు. ఈ ప్లాంట్‌తో చెత్త శుద్దీకరణ అసాధ్యమని తేలిపోయింది. అయినా మున్సిపల్ యంత్రాంగం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేక పోయింది.
నిరుపయోగంగా వర్మీ కంపోస్టు షెడ్స్..
ఇండ్ల నుండి సేకరించిన తడి చెత్తతో వర్మీ కంపోస్టు యూరియా తయారు చేసేందుకు 2005లో కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో వర్మి కంపోస్టు తయారీ షెడ్లను నిర్మించారు. ఇందులో భాగంగా నగరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో నిర్మించిన షెడ్స్‌లో ఒకటి, రెండు సార్లు మాత్రమే యూరియా ఉత్పత్తి చేశారు. ఇలా కోతిరాంపూర్, హౌజింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతాల్లోని కంపోస్ట్ యూరియా షెడ్లు నిరుపయోగంగా మారాయి.
సవాల్‌గా మారిన నియంత్రణ..
చెత్త సేకరణ వరకే మున్సిపల్ యంత్రాంగం పరిమితమైంది. చెత్తను తగ్గించడం, నిల్వలను తొలగించి ప్రజల ఇబ్బందులను తొలగించే చర్యలేమీ చేపట్టడం లేదు. దీంతో కరీంనగర్ లోని డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి నోచడం లేదు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ, కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్..డంపింగ్ యార్డ్‌పై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఆ దిశగా చర్యలు చేపడితే..కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.