సిసి కెమెరాల పర్యవేక్షణలో శోభాయాత్ర.
ప్రధాన చోట్ల రూఫ్ టాప్ బందోబస్త్ ఏర్పాటు
అధికారులకు కరీంనగర్ సీపీ సూచనలు
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ లో జరిగే గణేశ్ నిమజ్జనానికి పోలీసు శాఖ పటిష్ట ఏర్పాట్లు చేసింది. పోలీసు కమీషరేట్ కేంద్రంలోని జాన్ విల్సన్ హాలు లో గణేష్ నిమజ్ఙన బందోబస్తుపై అధికారులకు కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి పలు సూచనలు చేసారు. నిమజ్జన కేంద్రాలయిన మానకొండూరు చెరువు , చింతకుంట కెనాల్ , కొత్తపల్లి చెరువులతో పాటు , గణేష్ శోభాయాత్ర జరిగే రూట్ లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద మరియు ఇతర ముఖ్యమైన చోట్ల పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో రూఫ్ టాప్ లో సైతం బందోబస్త్ ఏర్పాటు చేశామని తెలిపారు. అధికారులు మరియు సిబ్బంది అంతా నిమజ్జన కార్యక్రమం ముగిసే వరకు అప్రమత్తంగా వుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం జరిగేలా పోలీస్ పరంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా పోలీసులు జారీచేసిన నియమాలు ఉల్లంఘించి ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శాంతి భద్రతలు ఎ లక్ష్మీనారాయణ , ఏసీపీ లు శ్రీనివాస్ (సి. ఎస్. బి.), నరేందర్ (టౌన్), కాశయ్య , మాధవి , విజయ్ కుమార్ ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.