Saturday, July 5, 2025

వారసులెవరు ?

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల మార్పుపై చర్చ
కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో..
అధికార పార్టీలో ఆశావాహులు
నామినేటెడ్‌ పోస్టుల కోసం ప్రయత్నాలు
జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి
అధికార కాంగ్రెస్‌ పార్టీలో పదవులపై చర్చ జరుగుతోంది. టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నియామకమైన నేపథ్యంలో రాష్ట్ర కమిటీ, జిల్లాల అధ్యక్షుల నియామకాలు కూడా ఉండే అవకాశాలున్నాయి. ఈ నెల 15న కాంగ్రెస్‌ తెలంగాణ చీఫ్‌గా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో..ఆ తరువాత చేపట్టబోయే రాష్ట్ర కమిటీ లోని పదవులు, జిల్లా అధ్యక్ష పీఠాల కోసం నాయకులు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్ష పదవులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాత వారినే కొనసాగిస్తారా..కొత్తగా నియామకాలు చేపడుతారా అన్న చర్చ ఆయా జిల్లాల్లో జోరందుకుంది.

అధికార కాంగ్రెస్‌ పార్టీలో పదవుల పందెరం కొనసాగుతోంది. పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల కోసం సీనియర్‌ నేతలు పోటీ పడుతున్నారు. సుదీర్ఘ కాలం తరువాత తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడంతో సీనియర్‌ నేతల్లో ఆశలు రేకెత్తాయి. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతల తరువాత రాష్ట్ర కమిటీ నియామకాలు చేపట్టే అవకాశాలుండ డంతో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌, అధికార ప్రతినిధులు, కార్యదర్శులతో పాటు ఆయా విభాగాల అధ్యక్షుల నియామకాలు కూడా జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా, ఇతరాత్ర పదవుల్లో ఉన్నవారే ఉన్నారు. మరికొంత మంది నామినేటెడ్‌ పదవులను ఆశిస్తున్న వారున్నారు. ఈ నేపథ్యంలో అనేక చోట్ల మార్పు అనివార్యం కానుంది.
కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పీఠం ఎవరికి ?
కరీంనగర్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులుగా మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన రెండు సార్లు ఈ పదవికి నియామక మయ్యారు. మూడోసారి కూడా కవ్వంపల్లినే కొనసాగిస్తారా లేక కొత్తగా నియామకం చేపడుతారా..అనేది ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సన్నిహితంగా ఉన్న కవ్వంపల్లి మరోసారి డీసీసీ అధ్యక్షునిగా కొనసాగే విషయమై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. కాంగ్రెస్‌ కరీంనగర్‌ పార్లమెంట్‌ ఇంఛార్జి వెలిచాల రాజేందర్‌ రావు, కోమటిరెడ్డి పద్మాకర్‌ రెడ్డి, అంజన్‌ కుమార్‌, సుడా ఛైర్మన్‌ నరేందర్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆసక్తి చూపితే డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలు కూడా లేక పోలేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
పెద్దపల్లి డీసీసీ పీఠంపై ఆశలు
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ప్రస్తుత ఎమ్మెల్యే ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ కొనసాగుతున్నారు. జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గెలుపు కోసం ఆయన కృషి చేశారు. మహేశ్‌ కుమార్‌ టీమ్‌లో ఆయనకు అవకాశం ఇస్తారా, లేక డీసీసీగా కొనసాగిస్తారా..అనేది తేలాల్సి ఉంది. డీసీసీ అధ్యక్ష పదవికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆసక్తి చూపకుంటే, సీనియర్‌ నేత, మాజీ సర్పంచ్‌ అంతటి అన్నయ్య గౌడ్‌కు ఆవకాశాలున్నట్లు చర్చ జరుగుతుంది. గతంలో పని చేసిన ఈర్ల కొమురయ్య, మాజీ జడ్పీటీసీ గంట రాములు, సత్యనారాయణ రెడ్డిలు పార్టీ మారడంతో కాంగ్రెస్‌ పార్టీ లో అనుభవం ఉన్న సీనియర్‌ నేతల కొరత ఈ జిల్లాలో ఏర్పడిరది.
రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీ అధ్యక్ష పదవిపై..
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కొనసాగుతున్నారు. గతంలో కేకే మహేందర్‌ రెడ్డి పని చేసినప్పటికీ, పార్టీ క్యాడర్‌ను విస్తరించలేదనే విమర్శలున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ఆది శ్రీనివాస్‌ను యథావిధిగా కొనసాగిస్తారా, లేక పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సింగీతం శ్రీనివాస్‌కు అవకాశం కల్పిస్తారా అనేది తేలాల్సి ఉంది. జగిత్యాల డీసీసీ అధ్యక్షులుగా ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మన్‌ కుమార్‌ పనిచేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇచ్చే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అదే దళిత సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నేత బండ శంకర్‌, కొడిమ్యాల మాజీ సర్పంచ్‌ పిడుగు ప్రభాకర్‌ రెడ్డి, కోరుట్ల అసెంబ్లీ ఇంఛార్జి నర్సింగారావు..ఇందులో ఒకరికి డీసీసీ పీఠం కట్టబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆశీస్సులున్న వారికే ఈ జిల్లా డీసీసీ పీఠం దక్కుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page