రూ. 30 కోట్లకు పైగా నేతన్నలకు లబ్ధి
సహకార సంఘాల క్యాష్ క్రెడిట్..
ముద్ర లోన్స్ మాఫీ అయ్యే అవకాశాలు
ముందే చెప్పిన ‘జనత ’ దిన పత్రిక
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
తెలంగాణలో చేనేత రుణమాఫీకి పచ్చ జెండా ఊపింది కాంగ్రెస్ సర్కారు. హైదరాబాద్‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభ సభలో సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 6న ‘తెరపైకి చేనేత రుణమాఫీ’ అనే శీర్షికతో జనత న్యూస్ కథనం ప్రసారం చేసిన విషయి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆ కథనం నేడు వాస్తవ రూపం దాల్చింది.
చేనేత పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నేతన్నల ఉత్పత్తులకు ప్రపంచ మార్కెటింగ్ కల్పించేందుకు టెస్కో మార్కును రూపొందిస్తున్నారు అధికారులు. దీంతో పాటు చేనేత సహకార సంఘాల, వృత్తిపర రుణాలను మాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన చేసిన ప్రకటన వల్ల తెలంగాణ వ్యాప్తంగా 314 వరకు చేనేత సహకార సంఘాలు, అందులో పని చేస్తున్న కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత సహకార సంఘాలు..ఆయా సహకార బ్యాంకుల్లో క్యాష్ క్రెడిట్ రూపేనా అప్పులు మాఫీ అయ్యే అవకాశాలున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 33 నుండి 50 కోట్ల వరకు బ్యాంకుల్లో చేనేత సంఘాల రుణాలు ఉంటాయని అంచన. వీటితో పాటు చేనేత కార్మికులు వ్యక్తిగత వృత్తి పరంగా తీసుకున్న ముద్ర రుణాలు మాఫీ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ..చేనేత పరిశ్రమతో పాటు సుమారు 70 వేల కుటుంబాలకు కొంత మేర మేలు జరిగే అవకాశాలున్నాయి.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రూ. 7 కోట్లు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 36 చేనేత సహకార సంఘాలు ఆయా ప్రాంతాల్లోని సహకార బ్యాంకుల్లో తీసుకున్న సుమారు రూ. 7 కోట్ల వరకు రుణాలు మాఫీ అయ్యే అవకాశాలున్నాయి. 2004లో ఉమ్మడీ ఏపీలో అప్పటి వైఎస్ ప్రభుత్వం రూ. 327 కోట్ల చేనేత రుణమాలు మాఫీ చేసింది. దీంతో అప్పుడు మూడు లక్షల మంది చేనేత కార్మికులకు మేలు జరిగింది. మరోసారి కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం చేనేత రుణమాఫీని ప్రకటించింది. దీంతో చేనేత వర్గాల్లో హర్షం వ్యక్తమౌతోంది.