తలుచుకుంటే సర్కార్ తలరాతలే మారతాయి
కాంగ్రెస్ కు ఓట్లేస్తే టీచర్లకు ఏం ఒరిగింది?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
గురుపూజోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు
కరీంనగర్-జనత న్యూస్
రోడ్లపైకొచ్చి కొట్లాడండి..విద్యార్థుల సమస్యలపై గళం విప్పండని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలపై తాను పోరాడి జైలుకెళ్లానని, ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌కు ఓటేశారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు రెండే నని..ఈ ప్రభుత్వంలో టీచర్ల సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ కు ఓట్లేసిన పాపానికి టీచర్లకు డీఏల రాలేదని, పీఆర్సీ లేదని, చివరకు రిటైర్డ్ అయితే పెన్షన్ పైసలు వచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. ఆనాడు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగి.. ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నూటికి 70 శాతానికిపైగా ఎంఈఓ, డిఈవో, డైట్ లెక్చరర్స్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయని, వాటని నేటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే డీఏలు, ప్రమోషన్లు ఆగేవి కావని, కేంద్రం పెండిరగ్ డీఏలు ఇచ్చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. సర్కారు బడి పిల్లలకు మంచి చదువు చెప్పాలని, వారికి కనీస సౌకర్యాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. గొంతెత్తి ప్రశ్నించలేని పేద కుటుంబాల నుండి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు భరోస ఇవ్వాలని కోరారు. విద్యార్థులకు చదువు, సంస్కారం, విలువలను బోధిస్తూ సమాజానికి గొప్పగొప్ప వాళ్లను అందించే పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. టీచర్లు తలుచుకుంటే ప్రభుత్వ తల రాతలే మారుతాయన్నారు. బీఈడీ అర్హతలుండి ఎస్జీటీలుగా పనిచేస్తున్న టీచర్లకు ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని కేంద్రంలోని హెచ్ ఆర్ డీ శాఖ మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లి ఎన్సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) గైడ్ లైన్స్ లో మార్పులు చేయించేందుకు ప్రయత్నం చేస్తా నని హామీ ఇచ్చారు. పాఠ్యాంశాల్లో మళ్లీ నక్సలైట్ సిద్దాంతాలను, కమ్యూనిస్టు మూలాలను జొప్పించే కుట్ర జరుగుతోందని, విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేసే వ్యక్తులు చొరబడుతున్నారని, ఎదురించి నిలువరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘గురు వందనం’ కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తపస్ రాష్ట్ర నాయకులు కట్టా రాజేశ్వర్, హనుమంతరావు, తిరుపతిరావు తదితరులు హాజరయ్యారు. చివరగా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.