కంగనారనౌత్‌పై మరో వివాదం
సిక్కు సామాజిక వర్గం నుండి ఫిర్యాదలు
జనత : సెప్టెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దంగా ఉన్న ఎమర్జెన్సి సినిమాపై వివాదం ముదిరింది. ఈ సినిమా ప్రదర్శనపై కాంగ్రెస్ సహా సిక్కు సామాజిక వర్గం నుండి వ్యతిరేకత వ్యక్తమౌతోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల నుండి ఫిర్యాదులు వస్తున్నారు. హైదరాబాద్ గౌలిగూడ సెంట్రల్ గురుద్వార్, కరీంనగర్‌లో సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధుల బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ కలిసి ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం విధించాలని కోరింది. సినిమాలో సిక్కు సమాజాన్ని చూపించిన తీరు పట్ల సిక్కు సొసైటీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలో సినిమాను నిషేధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
బాలీవుడ్ నటి కంగనారనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎమర్జెన్సీ సినిమా.. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాలనలో 1975 జూన్ 25 నుండి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. రాజకీయ నేపథ్యంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కంగనారనౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటించడం విశేషం. మండి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్న రనౌత్..కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తెలంగాణలో ఎమర్జెన్సీ సినిమా విడుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా అసక్తి నెలకొంది.