3 నెలల పెండిరగ్ వేతనాలు, ఇతర సమస్యలపై..
సిబ్బంది ఆందోళన బాట
నిలిచి పోయిన పారిశుధ్య, ఇతర సేవలు
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రిలో సమ్మెకు దిగారు కాంట్రాక్టు కార్మికులు. దీంతో వివిధ విభాగాల్లో పారిశుధ్య పనులతో పాటు, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాల్లో సేవలు నిలిచి పోయాయి. దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. 3 నెలల వేతనాలు చెల్లించడం లేదని..దీంతో సమ్మె చేస్తున్నట్లు కార్మికులు తెలిపారు.
నగరంలోని ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రి సిబ్బంది సమ్మెకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియర్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ ఈ సమ్మెను ప్రారంభించారు. దీంతో శుక్రవారం ఉదయం నుండి ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో సేవలు నిలిచి పోయాయి. ప్రధాన ఆసుపత్రితో పాటు మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో సుమారు 250 మంది సానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు సమ్మెలోకి వెళ్లడంతో..ఆయా విభాగాల్లో రోగులకు సేవలు అందని పరిస్థితులు నెలకొన్నాయి. అసలే సీజనల్ వ్యాధులతో ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. ఈ పరిస్థితుల్లో సిబ్బంది సమ్మెకు వెళ్లడంతో..ఫీవర్, జరనల్ వార్డు, ఎంసీహెచ్ వార్డుల్లోని రోగులు, బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు.
కార్మికుల సమ్మెకు కారణాలు..
కరీంనగర్ మెడికల్ ఆసుపత్రిలో 250 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. వారికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. గతంలోనే వీటిపై హైదరాబాద్ లోని డీఎంఈ వద్దకు వెళ్లి పెండిరగ్ వేతనాలు చెల్లించాలని కోరినా స్పందన లేక పోవడంతో, అనివార్యంగా సమ్మెకు దిగారు కార్మికులు. ఆసుపత్రిలో 250 మంది కార్మికులకు గాను 120 మందికి మాత్రమే వేతనాలు చెల్లంచేలా..ఆర్థిక శాఖకు డీఎంఈ నివేదిక ఇవ్వడంతో సమస్య ఉత్పన్నమైనట్లు కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాక పోవడంతో..కాంట్రాక్టరు చేతులెత్తాశాడు. వీటికి తోడు ఆసుపత్రిలో కార్మికులపై వివక్ష కొనసాగుతోందని, పీఎఫ్, ఈఎస్‌ఐ కూడా చెల్లించడం లేదని కార్మికులు వాపోతున్నారు. వీరి సమ్మెకు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యుగేందర్ సంపూర్ణ మద్దతు తెలిపారు.
సమస్య పరిష్కారం అయ్యే వరకు సమ్మె
బండారి శేఖర్, యూనియన్ గౌరవ అధ్యక్షులు
మూడు నెలల వేతనాల చెల్లంపుతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ పూర్తి స్థాయిలో అమలు చేయాలి. కార్మికులపై వైద్యాధికారుల వేదింపులు మానుకోవాలి.
కార్మికులకు జీతాలు ప్రతినెల 5 తేదీ లోపు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. వీటిపై నిర్థిష్టమైన లిఖిత పూర్వక హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తాం.