కరీంనగర్-జనత న్యూస్
నామినేటేడ్ పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఆశావాహులు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయాల ఛైర్మన్ల పదవు లతో పాటు రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ల ఛైర్మన్ల పదవుల కోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నేతలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 25 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అత్యధిక ఛైర్మన్ల పదవుల ఎంపిక పూర్తయినట్లు సమాచారం. జిల్లా లైబ్రరీలు, డైరెక్టర్ల పదవులపై కూడా పోటీ నెలకొన్నట్లు తెలుస్తుంది. ఆశావాహులు ఎక్కువగానే ఉన్నా..కాంగ్రెస్ సీనియర్లకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తుంది.
మరో నాలుగు రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. శుభ కార్యక్రమాలతో పాటు..నియామకాలు, ప్రమాణ స్వీకారోత్సవాలకు..మంచి రోజులు కావడంతో..ప్రభుత్వం కూడా ఆ దిశగా నియామకాలు చేపట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..దీన్ని విస్తృత ప్రచారంలోకి తీసుకెళ్లాలని చూస్తోంది. రైతులకు అనుసంధానంగా ఉండే మార్కెట్ కమిటీ పాలక వర్గాల నియామకాలను పూర్తి చేసి, వారి ద్వారా రైతులకు మరింత చేరువయ్యేలా చూస్తోంది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 25 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. ఆయా పాలక వర్గాల నియామకాలు త్వరలో పూర్తి చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే మెజారిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్ల ఎంపిక పూర్తయినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంఛార్జిలు, మంత్రుల ద్వారా ఈ ఎంపిక పూర్తి చేసినట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా కరీంనగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి ఎల్‌ఎల్ గౌడ్‌కు ఖరారు చేసినట్లు తెలిసింది. తిమ్మాపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కష్ట కాలంలో పార్టీ కోసం పని చేశారాయన. కరీంనగర్, మానకొండూర్ రెండు నియోజక వర్గాల పరిధిలో ఈ మార్కెట్ యార్డ్ ఉన్నప్పటికీ..డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్..వీరిద్దరు ఎల్‌ఎల్ గౌడ్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. మానకొండూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి పలువురు నేతలు పోటీ పడుతున్నా..లలితాపూర్ మాజీ సర్పంచ్ మర్రి ఓదెలు వైపు ఎమ్మెల్యే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హుజురాబాద్ మార్కెట్ కమిటీకి మాజీ ఛైర్మన్ తోట రాజేంద్ర ప్రసాద్, జమ్మికుంట మార్కెట్ కమిటీకి పోనగంటి మల్లయ్య ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
చొప్పదండి మార్కెట్ కమిటీకి ఉత్తర్వూలు..
ఇప్పటికే చొప్పదండి మార్కెట్ కమీటీ ఛైర్మన్‌గా కొత్తూరి మహేశ్ (ఎస్సీ), వైస్ ఛైర్మన్‌తో పాటు డైరెక్టర్ల నియామకం పూర్తయింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు అత్యంత సన్నిహితుడిగా, పార్టీ సీనియర్ నేతగా మహేశ్‌కు మంచి పేరుంది. బెజ్జంకి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా గాగిల్లాపూర్‌కు చెందిన పులి కృష్ణ పేరు దాదాపు ఖరారు అయింది. ఉత్తర్వూలు వెలువడాల్సి ఉంది. ఇల్లంతకుంటలో ఇద్దరు పోటీ పడుతుండగా..ఇందులో ఓ సీనియర్ నేతకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి వరించే అవకాశాలున్నాయి. ఇలా ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల్లో మార్కెట్ కమిటీల ఛైర్మన్ల పదవులు దాదాపుగా ఖరారు అయినా..అధికారిక ఉత్తర్వూలు రావాల్సి ఉంది.
ఇతర పదవులపై భారీగా పోటీ
జిల్లా స్థాయిలో లైబ్రరీ ఛైర్మన్ పదవులపై ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి కోసం డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల కోసం అంజన్ కుమార్, సిరాజ్, హుస్నాబాద్ నుండి కర్ణకంటి మంజుల రెడ్డి, బొమ్మ శ్రీరాం చక్రవర్తి..ఇలా పలువురు తమకు నామినేటెడ్ పదవులు కావాలని అదిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తుంది. అయితే..ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రుల సిఫారసులను పరిగణలోకి తీసుకునే ఎక్కువగా అవకాశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక.. నామినేటెడ్ పదవుల నియామకాలపై ఉత్తర్వూలు వెలువడే అవకాశాలున్నాయి.
నామినేటెడ్ పదవులపై..ఆశలు
- Advertisment -