ఎరువుల కర్మాగారం, విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు
రాష్ట్ర బడ్జెట్‌లోనూ కేంద్ర నిధుల కేటాయంపులు
ఆరు గ్యారెంటీలకు నిధులేవీ..?
కాంగ్రెస్ సర్కారుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్
కరీంనగర్-జనత న్యూస్
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపనలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ లోని ఓ ప్రయివేటు హోటల్‌లో బీజేపీ నేతలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల తెలంగాణ ప్రజలకు జరిగే లబ్ధిని వివరించారు. ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 20 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి కల్పించే పథకంలో తెలంగాణాలోని నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూరుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కోటి ఇండ్ల పథకంలో తెలంగాణకు లక్షలాది ఇండ్లు మంజూరు అవుతాయని తెలిపారు. కేంద్ర పన్ను ల రూపేనా రూ. 26, 216 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా రూ. 21, 075 కోట్లు, ఎఫ్‌ఆర్ బీఎంకు లోబడి రూ. 62 వేల కోట్ల రుణాలు మంజూరు అవుతాయని తెలిపారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షల 91 వేల కోట్లలో అప్పుల రూపేణ కేంద్రం రూ.1 లక్షా 9 వేల కోట్లను సమకూర్చుతుందని తెలిపారు. విభజన చట్టంలోని హామీ మేరకు కేంద్రం రూ. 6 వేల 323 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్దరించింది నిజం కాదా ? అని ప్రశ్నించారు. రూ. 11 వేల కోట్ల వ్యయంతో రెండు విద్యుత్ యూనిట్లు పూర్తి చేసి ఇప్పటికే 1600 మెగావాట్ల కరెంటును సరఫరా చేస్తున్నట్లు గుర్తు చేశారు. మరో 3 విద్యుత్ యూనిట్ల నిర్మాణం కోసం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పీపీపీ) చేసుకోవాలని కేంద్రం కోరుతున్నా, నాటి బీఆర్‌ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రైవేటు సంస్థల నుండి కరెంట్ కొనుగోలు చేయడం సిగ్గు చేటన్నారు. 3 విద్యుత్ యూనిట్ల నిర్మాణానికి అగ్రిమెంట్లు జరిగితే కేంద్రం నుండి మరో రూ. 21 వేల కోట్ల నిధులు వస్తాయని చెప్పారు. రూ. 1, 350 కోట్లతో ఎయిమ్స్ ను, రూ. 500 కోట్ల వ్యయంతో రైల్వే వ్యాగన్ ఓరాలింగ్ మ్యానుఫాక్చర్ యూనిట్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రూ. 899 కోట్లతో గిరిజన వర్శిటీని ఏర్పాటు చేసింది నిజం కాదా అని..వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసినప్పుడు సిరిసిల్లలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని 10 ఏళ్లు పాలించిన కేటీఆర్‌ఎందుకు ప్రతిపాదించలేదని నిలదీశారు.
రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై నిలదీత
నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు నిధుల కేటాయింపుపై మాట్లాడటం లేదని..కేటీఆర్, ఇక్కడి రాష్ట్ర మంత్రి ఇద్దరూ దోస్తులని ఎద్దేవ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అసాధ్యమని, క్వాలిటీ ఐరన్ ఓర్ లేదని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు తేల్చి చెప్పాయని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రంతో కొట్లాడి రాజకీయం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల్లో మహిళలకు రూ. 2500, నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి, వృద్దులకు రూ. 4 వేల పెన్షన్, తులం బంగారం పంపిణీకి నిధులేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో 14 మంది నేతన్నల ఆకలి మరణాలు జరిగినా పట్టించుకోరా..అని ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్.. ఆటో డ్రైవర్లకు రూ. 12 వేల ఆర్థిక సాయం ఇస్తారా, ఇవ్వరా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 60 వేల ఉద్యోగాలిస్తున్నట్లు చెప్పడం పెద్ద జోక్ అని.. నిధులు కేటాయించకుండా కోటి మంది మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారని ప్రశ్నించారు. లక్ష ఎకరాల్లో పామాయిల్ చెట్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ నిధుల్లో కేంద్ర వాటా ఉందో, లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. పచ్చి అబద్దాలతో కేంద్రాన్ని బదనాం చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన సీఎంకు ముఖం లేకనే నీతి అయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టారని ఆరోపించారు బండి సంజయ్. కాళేశ్వరం ఆలయ సంప్రదాయాలు పాటించకుండా బీఆర్‌ఎస్ నేతలు గర్భగుడిలోకి వెళ్లడం దుర్మార్గమని..వెంటనే తెలంగాణ ప్రజలకు, భక్తులకు క్షమాపన చెప్పాలని కేటీఆర్‌కు సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమా దేవి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.