Wednesday, September 9, 2026

ఐటీ టవర్‌ వెల వెల !

కంపెనీలు రావు..ఉద్యోగాలూ రావు
హైదరాబాద్‌లో నిరుద్యోగుల వెతలు
కరీంనగర్‌ ఐటీ టవర్‌పై ప్రభుత్వ వివక్ష !
ఈ అసెంబ్లీ సమావేశాల్లో నైనా చర్చ జరిగేనా ?

కరీంనగర్‌-జనత న్యూస్‌
‘‘ కరీంనగర్‌ ఎల్‌ఎండీ సమీపంలో రూ. కోట్ల ఖర్చుతో ఐటీ టవర్‌ నిర్మించి అట్టహాసంగా ప్రారంభించింది అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కారు. యేటా వేలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది కూడ. కంపెనీ ప్రతినిధులతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు ప్రకటించి ఆ వేదికపైనే అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్‌ ఆశలు కల్పించారు. దీంతో ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువత మురిసి పోయింది. కాని ఆ మురిపెం కొద్దిరోజులే మిగిలింది. ప్రభుత్వాలు మారాయి. ఈ నాలుగేళ్ల కాలంలో కనీసం 500 మందికి కూడా ఉద్యోగాలు రాలేదు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనైనా ఇక్కడి ఐటీ టవర్‌లో సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు వస్తాయని కోటి ఆశలతో ఉన్న నిరుద్యోగులకు మరోసారి నిరాశే మిగిలింది. కంపెనీలు రాలేదు..ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలూ రాలేదు’’

నిరుద్యోగ సమస్య భారీగా పెరుగుతోంది. ఐటీ ఉద్యోగాల వేటలో యువత కొట్టు మిట్టాడుతోంది. బెంగుళూర్‌, చెన్నై, హైదరాబాద్‌ లాంటి నగరాలకు వలస వెల్లుతున్నారు యువతీ యువకులు. ఐటీ పరిశ్రమ వికేంద్రీకరణ పేరుతో అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కారు జిల్లాల్లోనే ఉద్యోగ కల్పనకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం తరువాత కరీంనగర్‌లో ఐటీ టవర్‌ను నిర్మించింది. రూ. 34 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో నిర్మించిన ఈ ఐటీ టవర్‌ను 2020 జూలైలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. వేదికపై పలు కంపెనీల ప్రతినిధులు ఎంఓయూలు చేసుకున్నారు.
ఇక్కడి వరకు భాగానే ఉన్నా..ఆ తరువాత ఉద్యోగ అవకాశాల కల్పనపై దృష్టి సారించలేక పోయింది అప్పటి ప్రభుత్వం. నిర్వహణ భారం, ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం కల్పించ లేక పోవడం వల్ల కొత్తగా కంపెనీలు ఏర్పడలేదు. 2022 వరకు పది కంపెనీల్లో 200 మంది వరకు మాత్రమే ఉద్యోగ కల్పన జరిగింది.ఆ తరువాత క్రమ క్రమంగా పడి పోయింది. ప్రస్తుతం ఐటీ టవర్‌లో రెండు కంపెనీలు మాత్రమే ఉన్నాయంటే..పరిస్థితి ఏలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నిర్వహణా భారం..
కొత్తగా వచ్చే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించాల్సి ఉంటుంది. కాని కరీంనగర్‌లోని ఐటీ టవర్‌కు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు..పైగా అద్దెలు, ఇంటర్‌నెట్‌ తదితర సదుపాయాలు భారంగా మారాయి. మెయింటెన్స్‌, విద్యుత్‌, ఇంటర్నెట్‌ ఛార్జీలు ఎక్కువగా వసూలు చేయడంతో నష్టాల భారంతో కంపెనీలు వెనక్కి వెళ్తున్నాయి. దీంతో ఇక్కడ కొత్తగా నెలకొల్పేందుకు స్టార్ట్‌అప్‌ కంపెనీలు ముందుకు రావడం లేదు.

ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబుపైనే భారం
కరీంనగర్‌ ఐటీ టవర్‌లో కొత్త కంపెనీల ఏర్పాటుకు ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు చొరవ చూపితే..నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలున్నాయి. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో జెఎన్‌టీయూతో పాటు పలు ప్రయివేటు కాలేజీల్లో ప్రతీ యేడు వేలాది మంది బీ`టెక్‌ పూర్తి చేసుకుని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు ఇతర పట్టణాలు, విదేశాలకు వలస వెళ్తుండగా..వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక, ఇతర పనులు దొరకక ఇక్కడే దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలనే నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.
ఎమ్మెల్యే గంగుల స్పందనపై ఉత్కంఠ..

కరీంనగర్‌లో ఐటీ టవర్‌ ఏర్పాటుకు కృషి చేసిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌..ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక రావాలనే డిమాండ్‌ నిరుద్యోగుల్లో వ్యక్తమౌతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కరీంనగర్‌ ఐటీ టవర్‌పై మాట్లాడి ప్రభుత్వం నుండి హామీ పొందుతారని ఆశిద్ధాం.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page