ఇప్పటికే మార్గదర్శకాలు జారీ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.2 వేల కోట్ల లబ్ధి ?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో..
సంబురాలకు కాంగ్రెస్ నేతల సమాయత్తం
కరీంనగర్-జనత న్యూస్
రైతుల కల సాకారం అయ్యే రోజు రానే వచ్చింది. రూ. రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు ప్రారంభానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 18 నుండి బ్యాంకు రుణాలు మాఫీ కానున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతిచ్చారు. తొలిరోజు రూ. లక్ష లోపు ఉన్న రైతులకు రుణమాఫీ జరగే అవకాశాలున్నాయి. రుణమాఫీ విధి విధానాలకు సంబంధించి మార్గ దర్శకాలను విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం..రేపటి నుండి సంబురాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వ ఆదేశాల వల్ల కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మూడు లక్షల మంది రైతులకు రూ. రెండు వేల కోట్లకు పైగా బ్యాంకు రుణాలు మాఫీ అయ్యే అవకాశాలున్నాయి.
ఉమ్మడి జిల్లాలో చిన్న కమతాలే ఎక్కువ
కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో అధికశాతం రెండెకరాల లోపు చిన్న కమతాలను సాగు చేసే రైతులే అధిక శాతం ఉన్నారు. వీరికి పంటల ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. చిన్న కమతాలను సాగుచేసే రైతులు దాదాపు 3.5 లక్షల మంది వరకు ఉంటారని అంచన. వీరందరూ తమ సామర్థ్యం మేరకు లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న వారే. మిగిలిన వారిలో ఐదు, పది ఎకరాలకు మించి సాగుచేసే వారిలో కొందరు 2 లక్షల వరకు పంటరుణాలు తీసుకున్నారు. వీరందరికీ తొలి దశలోనే రుణమాఫీ అయ్యే అవకాశాలున్నట్లు స్పష్టమౌతుంది.
రైతులకు రూ. 2 వేల కోట్లు మాఫీ ?
రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వ మార్గ దర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో వ్యవసాయ, బ్యాంకు అధికారులు రెండు లక్షల రుణమాఫీపై అంచనా వేశారు. కరీంనగర్ జిల్లాలో సుమారు 92 వేల మంది రైతులకు రూ. 650 కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ అవుతుందని అంచన. పెద్దపల్లిలో 90 వేల మందికి రూ. 500 కోట్లకు పైగా..సిరిసిల్లలో 61 వేల మందికిరూ. 400 కోట్లకు పైగా..జగిత్యాలలో 90 వేల మంది రైతులకు రూ. 550 కోట్లకు పైగా రైతు రుణమాఫీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.