కలెక్టర్ ఎదుట మాజీ సర్పంచ్‌ల భావోద్వేగం
మూడేళ్లుగా రూ. లక్షలో బిల్లులు
కాంగ్రెస్ సర్కారూ పట్టించుకోవడం లేదని ఆవేదన
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ ప్రజావాణి కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు భావోద్వాగానికి లోనయ్యారు. చేసిన పనులకు బిల్లులు రావడం లేదని, ఇక తమకు ఆత్మహత్యే శరణ్యమని తీవ్ర ఆవేదన చెందారు.పోలీసులు బయటకు పంపివేయడంపై వారు ఆందోళన చెందారు. మీడియా ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో మాజీ సర్పంచ్‌ల గోడు రాష్ట్ర వ్యాప్త చర్చకు తెర లేపింది. గంగాధర, రామగుడు మండలాలకు చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు జిల్లా కలెక్టర్ పమేల సత్పతిని కలసి గోడు వెల్లబోసుకుంటూనే భావోద్వేగానికి లోనయ్యారు. ఒక దశలో అదుపు తప్పి ఆత్మహత్య చేసుకుంటామని భీష్మించుకోవడంతో పోలీసులు వారిని బయటకు పంపి వేశారు. గంగాధర, రామడుగు మండలాల నుండి ప్రజావాణికి వచ్చిన మాజీ సర్పంచ్‌లు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రామడుగు మాజీ సర్పంచ్ ప్రమీల జగన్మోహన్ గౌడ్, గంగాధర మండలం గర్షకుర్తి మాజీ సర్పంచ్ అలువాల తిరుపతి..తమ ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా లక్షలాది రూపాయల తమ పెండిరగ్ బిల్లులు రావడం లేదని, దీంతో అప్పులు చేల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నట్లు తెలిపారు. తమకు బిల్లులు రాకుంటే..ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా తనకు రూ. 60 లక్షల బిల్లులు రావాల్సి ఉందని..ఇంట్లోని బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి అప్పులు చేశానని, వడ్డీ చెల్లించలేని స్థితిలో ఉన్నానని రామడుగు సర్పంచ్ జగన్మోహన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తమను వేధింపులకు గురి చేసిందని..తమ ప్రభుత్వం వచ్చాక బిల్లులు చెల్లిస్తామన్న రేవంత్ రెడ్డి..8 నెలలుగా మొండి చెయ్యి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు.