ప్రయివేటు, కార్పోరేట్ విద్యా సంస్థలకు..
వర్తించని విద్యాహక్కు చట్టం
జిల్లాలో 18 వేలకు పైగా పేద విద్యార్థులకు నష్టం
తల్లిదండ్రులపై రూ. 500 కోట్లకు పైగా భారాలు
అచేతనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
కరీంనగర్-జనత న్యూస్
‘‘ పేద, వెనుకబడ్డ తరగతి విద్యార్థులకు ప్రయివేటు, కార్పోరేట్ విద్యా సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి’’ ఇది 2009 కేంద్ర ప్రభుత్వ విద్యాహక్కు చట్టం చెబుతోంది. కాని ఇదెక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదు. ఇక విద్యాశాఖ అధికారులైతే ప్రయివేటు యాజమాన్యాల అడుగులకు మడుగొత్తే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పేద విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోంది. ఈ చట్ట ఉల్లంఘన వల్ల ఒక కరీంనగర్ జిల్లాలోనే యేటా సుమారు 18 నుండి 20 వేల వరకు టెన్త్ క్లాస్ లోపు పిల్లలు నష్టపోవాల్సి వస్తోంది.
‘6`14 ఏళ్లలోపు పిల్లలందరికీ నిర్భంద విద్య..ప్రయివేటు, కార్పోరేట్ విద్యా సంస్థల్లో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య’ ఓ మంచి ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం చట్టం చేసింది. నిరుపేదలు కూడా ధనవంతుల పిల్లలతో సమానంగా చదువుకునే కొంత అవకాశాన్ని..ఈ చట్టం ద్వారా కల్పించింది. చట్టం చేయడం వరకు బాగానే ఉన్నా..అమలులో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి ప్రభుత్వాలు. దశాబ్ధాల కాలంగా ఇదెక్కడా అమలుకు నోచుకోవడం లేదు. దీని వల్ల ఉన్నత లక్ష్యం నెరవేరని పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్రంలో 10వ స్థానంలో జిల్లా
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌళిక సదుపాయల కల్పన, బోదనలో నిర్లక్ష్యం వల్ల ప్రయివేటు, కార్పోరేట్ రంగం మూడు పూలు`ఆరు కాయలుగా విస్తరిస్తోంది. రెండేండ్ల క్రితం ప్రభుత్వ గణాంకాలే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో 50.23 శాతం ప్రయివేటు, కార్పోరేట్ పాఠశాలల్లో చదువుతుండగా, 49.77 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రయివేటు విద్యా సంస్థల్లో హైదరాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, కరీంనగర్ జిల్లా పదో స్థానంలో నిలిచింది.
జిల్లాలో రూ.500 కోట్లకు పైగానే నష్టం
కరీంనగర్ జిల్లాలో 647 ప్రభుత్వ పాఠశాలల్లో 42, 523 మంది విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటులో సగటున 50.23 శాతం పిల్లలు ఉండగా..ఈ జిల్లాలో మాంత్రం 75 శాతం వరకు ఉంటారని అంచన. ఈ లెక్కన 300 ప్రయివేటు, కార్పోరేట్ పాఠశాలల్లో మొత్తం 75 వేల వరకు పిల్లలు చదువుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో విద్యాహక్కు చట్ట ప్రకారం 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తే 18 వేల మంది పేద విద్యార్థులకు లాభం జరిగేది. ఈ చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల యేటా రూ. 500 కోట్లకు పైగానే పేరెంట్స్ నష్టపోతున్నారు. ఒకవేళ ఈ చట్టం అమలు జరిగి ఉంటే..ఆర్థికంగానే కాకుండా, మంచి ర్యాంకులతో ఉన్నత చదువులతో సివిల్స్, ఇతర ఉన్నత స్థాయిలో నిలిచి ఉండేవారు.
అచేతనంగా ప్రభుత్వాలు
ఉచిత విద్యాహక్కు చట్టంలోని 25శాతం పేదలకు ప్రయివేటు సంస్థల్లో ఉచిత సీట్లు కేటాయింపు అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు స్ఫష్టమౌతోంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు నష్టపోతున్నారు. చట్టాల్లో అనేక సంస్కరణలు, కొత్త చట్టాలపై దృష్టి సారిస్తున్న ప్రభుత్వాలు..2009 నాటి విద్యా హక్కు చట్టాన్ని ఎందుకు పూర్తి స్థాయిలో అమలు చేయలేక పోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై విద్యార్థి, యువజన సంఘాలతో పాటు సామాజిక వేత్తలు తమ గొంతుకలు వినిపిస్తున్నా..ప్రభుత్వాలు మాత్రం చెవులుండీ విననట్లు, కళ్లుండీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయి.
కోర్టులను ఆశ్రయించడమే మేలా..?
రాష్ట్ర ప్రభుత్వం దీనిప్లై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. పైగా ప్రయివేటు విద్యా సంస్థల యాజమాన్యానికి ఉప్పందిస్తున్నారు. దీనివల్ల పుట్ట గొడుగుల్లా సంస్థలు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం విద్యా లాభసాటి వ్యాపారంగా మారింది. ప్రస్తుత ఈ పరిస్థితుల్లో ఉన్నత స్థాయి కోర్టులను ఆశ్రయిస్తే, ఇప్పటికిప్పుడు న్యాయం జరుగకుండా దేశ వ్యాప్త చర్య జరిగే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. ఆ దిశగా సామాజిక వేత్తలు, ఉద్యమకారులు ప్రయత్నాలు చేస్తారని ఆశిద్దాం.