హుజురాబాద్,జనత న్యూస్: హుజురాబాద్ లో మెడికల్ డ్రగ్ మాఫియా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. రోగులను నిలువు దోపిడీ చేస్తోంది. అధికార యంత్రాంగం నిఘా కొరవడడంతో పాటు కంచే చేనుమేసిన చందంగా అధికార యంత్రాంగం ఈ డ్రగ్ మాఫియాకు పూర్తిగా సహకరిస్తోంది. హుజురాబాద్ పట్టణంలో సుమారు యాభైకి పైగా మెడికల్ షాపుపు ప్రతిరోజూ లక్షలాది రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నాయి. ప్రధాన రహదారులపై ముఖ్య కూడళ్లలో ఉన్న ఉన్న కొన్ని మెడికల్ షాపులు ప్రతిరోజూ లక్షలాది రూపాయల మందుల విక్రయాలు జరుపుతున్నాయి. మిగతా మెడికల్ షాపులు ఆయా ప్రయివేటు నర్సింగ్ హోమ్ లకు, ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్నాయి. ఈ మెడికల్ షాపుల్లో నాణ్యత లేని సెకండ్స్, జనరిక్ మందులతో పాటు ఎక్స్పైరీ మందులు విక్రయిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. తద్వారా రోగులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. నాణ్యతలేని మందుల విక్రయాల ద్వారా మెడికల్ షాపులు లక్షల్లో ఆర్జిస్తున్నాయి.
డాక్టర్లతో.. అవగాహన – లక్షల్లో సంపాదన!
ప్రయివేటు ఆసుపత్రుల్లో నిర్వహించే మెడికల్ దుకాణాలకు డాక్టర్లకు మధ్య అవగాహన ఉంటోంది. మెడికల్ షాపుల నుండి డాక్టర్లకు కమిషన్లు వెళ్తున్నాయి. రోగులు వారి ఆసుపత్రులకు వచ్చేలా ఆర్ ఎం పి లకు కమిషన్లు ఇస్తూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవసరం లేకున్నా మెడికల్ షాపులకు లాభాలు రావాలనే ఉద్దేశంతో వారి ఒత్తిడితో డాక్టర్లు కూడా కొన్ని మందులు రాస్తున్నారు. ఇది రోగుల ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతోంది. మెడికల్ షాపుల్లో ఒరిజినల్ మందులు కాకుండా కొన్ని నకిలీ మందుల విక్రయాలు కూడా జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ, ఇతర ప్రాంతాల నుండి ఈ నకిలీ మందులు తెప్పించి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నకిలీ మందులు ఉపయోగించిన రోగులు కుదేలవుతున్నారు. కొందరు డాక్టర్లు మెడికల్ షాపులతో అవగాహన కుదుర్చుకుని రోగులకు అవసరం లేకున్నా గర్భసంచి, ఇతర ఆపరేషన్లు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తూతూ మంత్రంగా తనిఖీలు!
హుజురాబాద్ పట్టణంలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పదుల సంఖ్యలో ప్రయివేటు ఆసుపత్రులున్నాయి. చుట్టుపక్కల ప్రతినిత్యం వందలాది మంది రోగులు వైద్యం నిమిత్తం హుజురాబాద్ కు వస్తుంటారు. కొన్ని ఆసుపత్రులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు. ఇటు ఆసుపత్రులపై, అటు మెడికల్ షాపులపై వైద్య ఆరోగ్య, డ్రగ్ అధికారుల నిఘా కొరవడింది. అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహించినా తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. డ్రగ్ అధికారులను నెలనెలా మామూళ్లు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా హుజురాబాద్ లో డ్రగ్ మెడికల్ మాఫియా కారణంగా ఇటు ఆసుపత్రుల యజమానులు, మెడికల్ షాపుల నిర్వాహకులు లక్షలాది రూపాయలు అక్రమంగా ఆర్జిస్తుండగా.. రోగులు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా దెబ్బతింటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హుజురాబాద్ పై దృష్టిపెట్టి మెడికల్, డ్రగ్ మాఫియాపై ఆగడాలు అరికట్టి రోగుల ప్రాణాలు కాపాడడంతోపాటు ఆర్థికంగా నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.