-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరిక
కరీంనగర్,జనత న్యూస్: ఎవరైనా రైతులకు నకిలీ విత్తనాలు,నిషేధిత పురుగుమందులు అమ్మితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం కరీంనగర్ లోని గాంధీ రోడ్ లో టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లాలోని విత్తనాలు,ఎరువుల డీలర్లకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీలర్లు నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు,ఎరువులు,నిషేధించిన పురుగుల మందులు అమ్మవద్దని సూచించారు. ఒకవేళ అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు.ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా డీలర్లు నడుచుకోవాలని తెలిపారు.మార్కెట్లోకి నకిలీ విత్తనాలు,పురుగుల మందులు రాకుండా వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏదైనా సమాచారం తెలిస్తే అధికారులకు తెలుపాలని పేర్కొన్నారు.ప్రభుత్వం నిషేధించిన బీటీ- 3 పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించవద్దని స్పష్టం చేశారు. వ్యవసాయ అధికారులు విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో 15 రోజులకు ఒకసారి తరచూ విత్తనాలు, ఎరువుల షాపుల్లో తనిఖీలు చేస్తూ ఆడిట్ నిర్వహించాలని సూచించారు.డీలర్లు ఎప్పటికప్పుడు రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, పీఓఎస్ మిషన్ల ద్వారానే ఎరువుల అమ్మకాలు చేపట్టాలని పేర్కొన్నారు. గ్రౌండ్ స్టాక్ ఎరువుల నిల్వలు, పీఓఎస్ మిషిన్ల లోని నిల్వలతో సమానంగా ఉండాలని సూచించారు.కష్టపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఇబ్బందులకు గురిచేయడం సరికాదని వ్యవసాయ అధికారులు పంటల సాగుకు సలహాలు అందించాలని తెలిపారు. డీలర్లు లైసెన్సులను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలని, షాపుల్లో కనిపించేలా వాటిని పెట్టుకోవాలని సూచించారు.నిబంధనలు ఉల్లంఘించకుండా విక్రయాలు సాగించాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి రామానుజ చార్య,మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ దివ్యభారతి,ఏడీఏలు రణధీర్, సునీత,అంజలి,ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రతినిధి గౌరిశెట్టి మహేందర్,మండలాల వ్యవసాయ అధికారులు,డీలర్లు పాల్గొన్నారు.