హుజూరాబాద్, జనత న్యూస్: పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు నాడి అర్థం కాక రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను కరీంనగర్ లోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఎన్నికల కౌంటింగ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఫలితాలు జూన్ 4 న వెలువడను ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీ వైపు ఏ అభ్యర్థివైపు మొగ్గు చూపారు అనేది లక్ష డాలర్ల ప్రశ్నగా మిగిలింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా నియోజకవర్గానికి ఓతీరుగా మండలానికి ఓతీరుగా, గ్రామానికోవిధంగా పోలింగ్ జరిగినట్టు అంచనా వేస్తున్నారు. దీంతో పోలింగ్ సరళి పై క్లారిటీ రాక నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఏం జరిగింది?
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను పరిశీలిస్తే.. కొందరు ఓటర్లు ప్రధాని నరేంద్ర మోడీ వైపు మొగ్గు చూపారు. మరికొంతమంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అని కాంగ్రెస్కు ఓటు వేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతో, కేంద్రంలో ఉన్న బిజెపిపై వ్యతిరేకతతో కొందరు గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు కమలం వైపు మొగ్గు చూపగా, గ్రామీణ ప్రాంత ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ బిజెపి ఉన్నప్పటికీ ఎలుకతుర్తి లాంటి కొన్నిచోట్ల బిజెపికి ఓట్లు పడలేదని తెలుస్తోంది. కమలం పువ్వు గుర్తు గెలుస్తోందంటూ ఒక వాయిస్ స్ప్రెడ్ అవుతున్నప్పటికీ.. ఇందులో వాస్తవం ఎంత? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమిటి? పోలింగ్ సరళి ఎలా ఉంది? అనే ఆలోచన రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. మైనారిటీల్లో ఎక్కువమంది కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్టుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మహిళలు ఎటువైపు ఓటు వేశారు అన్నది తేల్చుకోలేకపోతున్నారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో 17,97,150 మంది ఓటర్లు ఉండగా.. 8,77,483 మంది పురుషులు, 9,19,565 మంది మహిళా ఓటర్లు, 102 మంది ఇతరులు ఉన్నారు. కాగా ఇందులో 6,34,663 మంది పురుషులు, 6,68,982 మంది మహిళా ఓటర్లు, 45 మంది ఇతరులు మొత్తం కలిపి 13,03,690 మంది అంటే 72.54 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మహిళల సైలెంట్ ఓటింగ్ ఎటువైపు?
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పురుషులకంటే ఎక్కువగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు అన్నది తెలియడం లేదు. 6,68,982 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరు ఎటువైపు మగ్గు చూపితే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. మెజారిటీ మహిళలు బిజెపికి మాకు చూపారా? లేక కాంగ్రెస్ లేదా టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపారా? అనేది తెలియక ఆయా పార్టీల నేతలు తర్జనభర్జన పడుతున్నారు.
విభిన్నమైన పోలింగ్ సరళి!
వేములవాడ, సిరిసిల్ల, హుజురాబాద్ నియోజక వర్గాల్లో తమకు తప్పకుండా మెజారిటీ ఉంటుందని గులాబీ పార్టీ భావిస్తోంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డబ్బు మద్యం పంపిణీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే డబ్బు మద్యం పంపిణీ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది ఆ నియోజకవర్గ ఓటింగ్ పై ప్రభావం చూపుతోందని భావిస్తున్నారు. చొప్పదండి, మానకొండూర్, కరీంనగర్ నియోజకవర్గాల్లోనూ మూడు పార్టీలు సమానంగా పోటీ పడుతున్నాయి. ఎవరు బయటపడ్డ కొద్ది మెజారిటీతోనే అనే ప్రచారమూ ఉంది. బి ఆర్ ఎస్ పార్టీ డబ్బు పంపిణీ చేయకపోవడం వల్ల ఆ పార్టీ ఓటు బిజెపి వైపు కొంత టర్న్ అయిందని వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో పోటీ పడుతున్న పార్టీలు బిజెపి, కాంగ్రెస్ అని కొందరు భావించి.. వారి మదిలో అంతర్గతంగా కెసిఆర్, బిఆర్ఎస్ పై అనుకూలంగా.. సానుభూతిగా ఉన్నప్పటికీ.. ఇది బి ఆర్ ఎస్ కు సంబంధం లేని ఎన్నిక కదా? ఇవి పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలు కదా! రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సమయంలో ఆ పార్టీకి అండగా ఉందాం! ఇది కేంద్రంలో జరుగుతున్న ఎన్నిక కదా! అన్న కోణంలోనూ కొందరు ఆలోచించినట్టు తెలుస్తోంది. అయితే కరీంనగర్ బండి సంజయ్ సొంత స్థానం కావడం వల్ల.. అక్కడ ఆయన ప్రభావం పోలింగ్ పై పడింది. వేములవాడ, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నందువల్ల వారు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేశారు. హుస్నాబాద్ స్థానంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్నందున అక్కడ మెజారిటీ చూపెట్టుకోవడం ఆయనకు సవాల్ గా మారింది. దీంతో ఆయన ప్రత్యర్థులకు చెక్ పెట్టే విధంగా వ్యూహం చేశారు. హుజురాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన ప్రభావాన్ని చూపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆయన తన వ్యూహానికి పదును పెట్టారని తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని మండలాల్లోనూ ఒకే తీరుగా ఒకే పార్టీకి అనుకూలంగా ఎక్కడా పోలింగ్ జరగలేదని స్పష్టం అవుతోంది. అన్ని రాజకీయ పార్టీలు డబ్బులు పంచుతాయని ఇటు పార్టీ శ్రేణులు అటు ఓటర్లు ఎదురు చూశారు. కానీ ఒకటి రెండు నియోజకవర్గాల్లో మినహా ఎక్కడ డబ్బులు రాకపోవడంతో వారు నిరాశ చెందడం కనిపించింది. ఇది కూడా పోలింగ్పై ప్రభావాన్ని చూపింది. చాలామంది ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఓటు వేసేందుకు ఆసక్తి కనబరిచినప్పటికీ.. డబ్బులు ఇవ్వని కారణంగా చాలామంది రాకపోవడం కూడా ఓటింగ్ శాతం తక్కువ అయ్యేందుకు కారణమైంది. కేవలం బూత్ కమిటీలకు మాత్రమే రూ.10 వేల నుండి రూ.25 వేల వరకు పంపిణీ చేశారు. ఎవరు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో ఉంటారన్నది కూడా చర్చ జరుగుతోంది.
ఏది ఏమైనా ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యం జూన్ 4న జరిగే కౌంటింగ్ తో బయటపడనుంది. అప్పటివరకు వేచి చూడాల్సిందే.