Narendra Modi: కరీంనగర్,జనతా న్యూస్: వేములవాడలో రేపు ఉదయం జరిగే ‘ఎములాడ జన సభ’ను దిగ్విజయవంతం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలు ఎండ వేడిమిని, వానలను తట్టుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడకు రావాలని తాము చేసిన విజ్ఝప్తి మేరకు నరేంద్రమోదీ విచ్చేస్తున్నందున, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి మోదీ సభను కనీవినీ ఎరగని రీతిలో దిగ్విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు సాయంత్రం వేములవాడ విచ్చేసిన బండి సంజయ్ కుమార్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణసహా స్థానిక నేతలతో కలిసి బాలానగర్ లోని బహిరంగ సభాస్థలిని పరిశీలించారు. సాయంత్రం కురిసిన వర్షంవల్ల ఎదురైన ఇబ్బందులను అధిగమించి అన్ని ఏర్పాట్లు చేసేందుకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘‘పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఎములాడ రాజన్న ఆలయాన్ని మోదీ సందర్శిస్తారు. అనంతరం నేరుగా బహిరంగ సభకు వస్తారు. ఎండ, వానలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం’’అని తెలిపారు. తమ విజ్ఝప్తి మేరకు మోదీ దక్షిణ కాశీగా పేరొందిన ఎములాడకు వస్తున్నందున ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరారు.
Narendra Modi: మోదీ సభకు స్వచ్ఛందంగా తరలిరండి
- Advertisment -