Saturday, September 13, 2025

Bandi Sanjay: మోదీ హృదయంలో బండికి ప్రత్యేక స్థానం

  • తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై
  • బండి సంజయ్ పోరాటాలను, నాయకత్వాన్ని కొనియాడిన అన్నామలై

హుజురాబాద్, జనత న్యూస్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హృదయంలో బిజెపి నేత, బిజెపి కరీంనగర్ పార్లమెంటరీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై అన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని అన్నారు. బండి సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శమయ్యాయని, ఆయన పాదయాత్ర స్పూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసి లాఠీలు, కేసులకు భయపడకుండా జైలుకు వెళ్లిన చరిత్ర సంజయ్ కే సొంతమన్నారు. బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లేనన్నారు. మొత్తం పోలైన ఓట్లలో 60 శాతం ఓట్లు బండి సంజయ్ కే పడేలా ఇంటింటికీ తిరిగి గెలిపించాలని యువతకు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో జరిగిన బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనానికి బండి సంజయ్ తోపాటు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. బండి సంజయ్ అద్భుతమైన నాయకుడని, ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటుతున్నడని, పోరాట యోధుడని ప్రశంసించారు.

బండి సంజయ్ కేవలం తెలంగాణకే కాకుండా దక్షిణ భారతదేశానికి నాయకుడని, ఆయన పాదయాత్ర స్పూర్తితోనే తాను తమిళనాడులో పాదయాత్ర చేశానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేస్తే.. దానిపై పోరాడినందుకు అనేకసార్లు అరెస్టయిన నాయకుడు బండి సంజయ్ అని, ఆయన సేవలను గుర్తించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిందని, ఆయన దక్షిణ భారత దేశంలో పార్టీని బలోపేతం చేస్తారనే నమ్మకం ఉందని అన్నమలై అన్నారు. బండి యూత్ ఐకాన్ అని, యువత ఆలోచనలను, ఆవేశాన్ని.. కుటుంబ పాలన అవినీతి పై పోరులో ప్రదర్శిస్తున్నారని, అందుకే బండి సంజయ్ కి చారిత్రాత్మక విజయాన్ని కరీంనగర్ ప్రజలు అందించబోతున్నారనే నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో ఓట్లు దండుకుని గద్దె నెక్కాక వాటిని పూర్తిగా విస్మరించిందని, మహిళలకు రూ.2500, రూ.4 వేల పెన్షన్, రూ.5 లక్షల విద్యార్థి భరోసా కార్డు, రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు, నిరుపేదలకు ఇంటి జాగా, రూ.5 లక్షల సాయం ఇవ్వలేదని.. అబద్దాలనే పునాదులపైనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

గుజరాత్ తో తెలంగాణ పోటీ పడుతోందని అంటున్న రేవంత్ రెడ్డి… గుజరాత్ లో సబర్మతి నదిని ఏ విధంగా ప్రక్షాళన చేశారో… అదేవిధంగా మూసీ నదిని మీరెందుకు ప్రక్షాళన చేయలేదని ప్రశ్నించారు. తమిళనాడులో పంట నష్టపోతే పరిహారం అందిస్తున్నారని, కానీ తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని, కిసాన్ సమ్మాన్ నిధిని యూజ్ లెస్ స్కీంగా కేసీఆర్ తీసిపారేశారని మండిపడ్డారు. కానీ రైతులకు మాత్రం కెసిఆర్ మెరుగైన సాయం ఎందుకు చేయలేకపోయారు? అని ప్రశ్నించారు. బండి సంజయ్ నాయకత్వంలో పోరాటాలే కాదు.. కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేశారని, ఈ దేశంలో రైతుల, యువత, మహిళల, విద్యార్థుల వ్యతిరేక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే.. అని ఎద్దేవా చేశారు. కరీంనగర్ లో 47 సెం.మీల ఎండ వేడిమి ఉందని, బండి సంజయ్ పోరాటంతో హీట్ డబులైందని ఆయన చమత్కరించారు. ఇకపై మీరంతా ఒక్కొక్క యువ మోర్చా నాయకుడు.. 100 మంది బీజేపీయేతర ఇండ్లకు వెళ్లి వారిని ఒప్పించాలని, సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు తాను రెండుసార్లు వచ్చానని అన్నమలై గుర్తు చేసుకున్నారు. బండి సంజయ్ కి 60 శాతం ఓట్లు, మిగతా పార్టీలకు 40 శాతం రావాలని, ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్టు చేసినందున ఎక్కువ మెజారిటీ చూపించాలని అన్నారు. ప్రభుత్వంపై పోరాడి జైలుకు వెళ్లారని, ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని, ఫోన్ ట్యాపింగ్ తో ఆయన కుటుంబం ఎంతో ఇబ్బంది పడిందని, మోదీ కోసం 5 రోజులు కష్ట పడితే… మోదీ తమకోసం 5 ఏళ్లు కష్టపడి సేవ చేస్తారని అన్నారు.

బండి సంజయ్ మాట్లాడుతూ.. భారతదేశ సింగమలై… అన్నామలై అని, అత్యున్నత ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ప్రజాసమస్యలపై యుద్దం చేస్తున్న నేత అన్నామలై అని నిరంతరం పాదయాత్ర చేస్తూ కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉన్న నాయకుడని, తమిళనాడులో బీజేపీ శక్తివంతంగా తయారు కావడంలో అన్నామలై కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. తాము పువ్వు గుర్తుపై ఓటేయాలని తిరుగుతుంటే… సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గాడిద గుడ్డు గుర్తు పట్టుకుని తిరుగుతున్నరని, కాంగ్రెస్ కు ఓటేయాలనుకునే వాళ్లు బ్యాలెట్ లో గాడిద గుడ్డు గుర్తు ఉంటేనే ఓటు వేయాలని ఆయన ఎద్దేవా చేశారు. మోదీపై విషం చిమ్ముతున్న కాంగ్రెస్ నాయకులను చూసి జనం నవ్వుకుంటున్నరని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం లేదని, కరీంనగర్ లో ఆ పార్టీ 3వ స్థానంలో ఉందని వ్యాఖ్యానించారు. ధరల పెరుగుదల గురించి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ నేతలు యూపీఏ 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్ల స్కాంలకు పాల్పడితే. 2జీ, బొగ్గు, సహారా సహా గాలి, నీటితోసహా అన్ని రకాల స్కాంలకు పాల్పడ్డారని, ధరల పెరుగుదల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని మండిపడ్డారు. కరీంనగర్ లో బీజేపీ గెలవాలని, దేశంలో మళ్లీ మోదీ ప్రధాని కావాలని, తనకు దేశం ముఖ్యమని, ఈ దేశం రక్షించబడాాలంటే ఏకైక నాయకుడు మోదీ మాత్రమే అని ఆయన ఉద్వేగంగా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కెప్టెన్ (ప్రధాని అభ్యర్ధి) లేరని, పేదల గురించి ఆలోచించడం లేదని అన్నారు. ఈ సమావేశంలో అన్నామలై ప్రసంగిస్తున్నంత సేపు చప్పట్లు, ఈలలతో యువత కేరింతలు కొట్టారు. ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ సభలో బిజెపి నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page