- కులమత విద్వేషాలు సృష్టించేందుకు మోడీ ప్రయత్నం
- అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే రాహుల్ ధ్యేయం
- కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, జనతా న్యూస్: కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు గ్రామం, అక్కన్నపేట మండల కేంద్రం, హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివారుల నుండి ఆయా గ్రామ సెంటర్ల వరకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి రోడ్డు షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముల్కనూరు, పందిళ్ళ గ్రామాల్లో గిరిజన సాంప్రదాయ దుస్తులతో తమకి స్వాగతం చెప్పేందుకు వచ్చిన మహిళలతో కలిసి మంత్రి పొన్నం, ఎంపీ అభ్యర్థి వెలిచాలలు నృత్యం చేశారు. ఈ సందర్భంగా అక్కన్నపేట మండల కేంద్రంలో మాట్లాడుతూ 2001లో అక్కన్నపేట నుండి హుస్నాబాద్ వరకు వేసిన ఆర్ అండ్ బి రోడ్డు పనులు తన కాంట్రాక్టులోనే జరిగాయని తెలిపారు. తనను ఎంపీగా గెలిపిస్తే హుస్నాబాద్ నుండి జనగాం వరకు ఫోర్ వే లైన్ రోడ్డు మంజూరుకి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేడు బిజెపి నేతలు ఓటమి భయంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, అంబేద్కర్ విగ్రహాలు తొలగిస్తానని ఒకడు అంటే.. రాజ్యాంగాన్ని రద్దు చేస్తానంటూ ఇంకొకడు.. రాముడు పేరు చెప్పుకొని మరొకడు.. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఓట్లు దన్నుకునేందుకు కుట్టిల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రమాణం ప్రకారం ఆగస్టు 15 నాటికి ప్రతి రైతుకి రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని.. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు గల్లా ఎగరేసి మరి చెప్పొచ్చని పేర్కొన్నారు. ఇక రాహుల్ గాంధీ భారత్ జూడో పేరుతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 10500 కిలోమీటర్ల మేర యాత్ర నిర్వహించి చరిత్ర సృష్టించారని, ఈ యాత్ర సందర్భంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఎలా పరిష్కరించాలో తన మేనిఫెస్టోలో స్పష్టంగా వెల్లడించారని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీఎస్టీని 12 శాతానికి తగ్గించి నిత్యవసర వస్తువులు ధరలను సామాన్యులకు అందుబాటులో తెస్తామని హామీ ఇచ్చారు. రాముని జపం చేసుకుంటూ బిజెపి రాక్షస పాలన కొనసాగిస్తుందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుపరిపాలన అందించి రామరాజ్యాన్ని తయారు చేసుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్ శ్రేణులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.