ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్
కరీంనగర్, జనత న్యూస్: ‘రేవంతన్నా… నేను 6 గ్యారంటీల సంగతేమైందని అడిగితే… గుండు, అరగుండ అంటూ హేళనగా మాట్లాడతవా? 5 ఏళ్లలో నేను చేసిన పోరాటాలు, కరీంనగర్ అభివృ తెచ్చిన నిధులు నీ కళ్లకు కన్పించడం లేదా?’’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. జమ్మికుంట సభలో సీఎం చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని, ఆయన ఉపయోగిస్తున్న భాష జుగుప్సాకరం. సీఎం హోదాలో ఉంటూ దిగజారి మాట్లాడటం సిగ్గు చేటు అని అన్నారు. సిరిసిల్ల పట్టణానికి విచ్చేసిన బండి సంజయ్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జమ్మికుంటలో నిర్వహించిన సీఎం బహిరంగ సభ అట్టర్ ఫ్లాఫ్ అయ్యిందని, ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనని విమర్శించారు.
సీఎంకు నా గుండుతో పనేంది? నాది అరగుండా? గుండా? అనేది నీకెందుకు? గాడిద గుడ్డు, అరగుండు, గుండు సున్నా అంటూ వ్యక్తిగతంగా కించపర్చడం సిగ్గు చేటు అని అన్నారు. తెలంగాణలో నేను చేసిన పోరాటాలు, కరీంనగర్ లో నేను చేసిన పోరాటాలు కన్పించడం లేదా? నా గుండు మాత్రమే నీకు కన్పిస్తుందా? అని ప్రశ్నించారు. నువ్వెంత హేళన చేసినా పట్టిచుంకోనని, ఆరు గ్యారంటీల్లో భాగంగా వంద రోజుల్లో మహిళల అకౌంట్లో ప్రతినెలా రూ.2500 లు ఇస్తానన్నవ్. ఏమిచ్చినవో చెప్పాలని అన్నారు. రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తానన్నవ్… ఏమిచ్చినవ్ అని ప్రశ్నించారు. గాడిద గుడ్డు, గుండు సున్నా తప్ప.. వడ్లకు బోనస్, తులం బంగారం, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా ఇస్తానన్నవ్. వ్రుద్దులకు రూ.4 వేల పెన్షన్ వంటివి మరిచిపోయావా? అని ప్రశ్నించారు.
మేం శ్రీరాముడి గురించి మాట్లాడుతుంటే.. దేవుడి పేరు చెప్పుకోవడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్న రేవంత్ రెడ్డికి.. దేవుడి మీద ఓట్టేసి రుణమాఫీ చేస్తాననడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. చివరకు ఆయనకు దేవుడే దిక్కయ్యిండని, మేం పక్కా రాముడి వారసులమని, బరాబర్ మాట్లాడతాం అని అన్నారు. మీ లెక్క తెలంగాణ ఉద్యమం చేస్తానంటే తుపాకీతో కాల్చేస్తానని నేను అనలేదని, ఢిల్లీలో టియర్ గ్యాస్, వాటర్ వదిలినా వెనుకంజ వేయకుండా జై తెలంగాణ అని గర్జించి గాండ్రించిన నాయకుడిని చెప్పారు.