- ఈనెల 15 నుండి 30 వరకు బ్రహ్మోత్సవాలు
- 19న తిరుకల్యాణం
- 23న శకటోత్సవం(బండ్లు తిరుగుట)
- 24న రథోత్సవం
బెజ్జంకి,జనతా న్యూస్: భక్తుల కోరికలు తీరిస్తూ ఇలవేల్పుగా నిలుస్తున్నాడు బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి. యాదాద్రి తరువాత కరీంనగర్ జిల్లాకు తలమానికంగా నిలుస్తూ నేటికి విశిష్ట పూజలందుకుంటున్నాడు. మండల కేంద్రంలో ఏకశిల గుట్టపై కోలువుదీరాడు లక్ష్మీనరసింహుడు.
ఆలయంలో ప్రతియేటా చైత్ర శుద్ధసప్తమి నుంచి చైత్ర బహుళ సప్తమి వరకు లక్ష్మీ నరసింహస్వామి బ్రహోత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతాయి. ఈ జాతరకు కరీంనగర్, సిద్దిపేట జిల్లాల నుండే కాకుండా నాందేడు, ముంబాయి, గుల్బర్గా, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నాగపూర్ వంటి ప్రదేశాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుని వెళ్తుంటారు. మొక్కిన వారికి వరాలిచ్చే స్వామిగా లక్ష్మీనరసింహుడికి ప్రతియేట లక్షల మంది భక్తులు బ్రహోత్సవాల్లో పాల్గొని దర్శించుకోని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఏకశిలతో నిర్మితమై తాబేలు ఆకారంలో గుట్ట ఉండడం ఇక్కడ ప్రత్యేకత.

●ఘనమైన ఆలయ చరిత్ర…
కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో లభ్యమైన కళ్యాణి చక్రవర్తుల కాలపు రెండు శిలాస్తంభ శాసనాలందు పేర్కొన్నబడిన “బెజవాంకెయ” నేటి బెజ్జంకి. బెజ్జంకి నృసింహ క్షేత్రము పురాతనమైనదే, తెలంగాణ ప్రాంతములో కరీంనగర్ జిల్లా కేంద్రము నుండి హైదరాబాదు వెళ్ళే మార్గమున రాజీవ్ రహదారిలో బెజ్జంకి గ్రామం ఉంది. బెజ్జంకి పూర్వ నామం “బెజవెంకి” లేదా “బెజవంక” ఇది క్రీ.శ.10వ శతాబ్దములో వేములవాడ రాజధానిగా పాలించిన వేములవాడ చాళుక్యుల ఆధీనములో ఉండేది.
బెజ్జంకి గ్రామానికి దక్షిణమున సుమారు 1 కి.మీ. దూరములో ఒక గుట్టపై ప్రాచీన కాలం నాటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం విరాజిల్లుతున్నది. రేచర్ల రుద్రుడి యొక్క మంత్రి కాటయ క్రీ.శ. 1236 సంవత్సరమున ఒక శివాలయము నిర్మించేనని ప్రతీతి.ఇందులో నంది, సూర్యదేవుడు, గణపతి, పార్వతీదేవి, సర్పరాజుల విగ్రహాలు ఉండి మధ్యలో ఒక శివలింగం నిర్మించబడినది.
గుట్టపైన ఆలయానికి పడమరగా బేతాళుడి విగ్రహం చెక్కబడి యున్నది. గుట్ట క్రింద ప్రధాన ద్వారమునందు నంది విగ్రహము కలదు. ఇక ప్రధాన ద్వారముపైన సీతారామలక్ష్మణ సహిత హునమంతుడు, ప్రహ్లాద, లక్ష్మీనరసింహుల మరియు రాధాకృష్ణుల విగ్రహాలు చక్కని శైలిలో ఆకర్షణీయంగా నిర్మించబడినవి . ఆలయంలో నాలుగు స్థంభాల రత్నమంటపం అనేక శిల్పకళారీతులలో చక్కని హావభావ విలాసములతో విరాజిల్లుచున్నది.ఈ బెజ్జంకి గుట్ట ఒకే పెద్ద గుండుగా (ఏకశిల) ఉండుట ప్రత్యేక విశేషం. ఈ ఆలయం కేవలం వైష్ణవాలయంగానే ప్రఖ్యాతినొందింది. కాకతీయులు శైవులైనప్పటికిని శివకేశవులకు భేదము లేదని తమ విశాల దృక్పధాన్ని ఋజువు చేసుకున్న మహోన్నతులు.ఆలయంలోని రాతిపై చెక్కిన శిల్ప కళాకృతులు చాళుక్యులు,కాకతీయుల కాలం నాటివని తెలుస్తోంది. గుట్టపై గల ఏకశిలతో నిర్మితమై ఉన్న ఆండాళ్ ధ్వజ స్థంభం ఆనాటి ఆనావాళ్ళకు నిలువెత్తు నిదర్శనం.
● ఆలయ విశిష్టతలు
ఆలయ నిర్మాణం ఏకకూట ఆలయంగా నిర్మింపబడి, నలుదిక్కుల ఉన్న స్తంభాలు కళాకండాలు సహాజ సిద్ధమైన కళను కలిగి ఉన్నాయి. కొండపైనున్న సహాజమైన గుహయే గర్భగృహముగా రూపొందింది. ఈ దేవాలయం సంపూర్ణంగా రాతితో నాలుగు స్తంభాలతో నిర్మించబడి ఉన్నది. గర్భగుడి ముందు భాగంలో స్వామి వారు దర్శనమిస్తారు.

● భక్తుల విశ్వాసం
గుట్టపై ఉన్న ఏక శిల గజస్తంభానికి సంతానం లేనటువంటి వారు ఒడిబియ్యం పోస్తే సంతానం కలుగుతుందని మహిళ ప్రగాఢ విశ్వాసం. గజస్తంభం చుట్ట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని ఆనావాయితీ. శకటోత్సవం రోజున ప్రత్యేకంగా ఆలకరించిన ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు,ఎండ్లబండ్లు, మేకల బండ్లతో గుట్ట చుట్టూ తిప్పి భక్తులు మొక్కు లు చెల్లించుకుంటారు. పౌర్ణమి రోజున ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉత్సవ మూర్తులను పెట్టి గుట్టచుట్ట్టూ ఉరేగింపు నిర్వహించగా, భక్తులు కోలటాలు, భజనలు, ఎదురు కోళ్లు, దీవిటిలతో స్వామివారికి స్వాగతం పలుకుతారు.

- వైభవంగా బ్రహ్మోత్సాలకు ఏర్పాట్లు..
ఈ ఏడాది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సాలను వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.జాతర ఉత్సవాల్లో ఈ నెల19న స్వామి తిరుకల్యాణంతో జాతర మొదటి గట్టం ప్రారంభమవుతోంది.23న శకటోత్సవం(గుట్ట చుట్టూ బండ్లు తిరుగుట)తో భక్తుల దర్శనం మొదలవుతుది.24న అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న రథోత్సవంతో గుట్ట చుట్టూ నిర్వహిస్తారు.జాతరకు భక్తులు హజరై తమ మొక్కులు చెల్లించుకోవడం ప్రత్యేకత