Pidakala Samaram: కర్నూలు(జనతా న్యూస్): సంక్రాంతి సందర్భంగా మాత్రమే పిడకలు గుర్తుకు వస్తాయి. ఒకప్పుడు వంట సామాగ్రిగా ఉపయోగించిన ఇవి రాను రాను కనుమరుగైపోతున్నాయి. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం పిడకలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీటితో ఒకరినొకరు కొట్టుకుంటూ ఉత్సవం జరుపుకుంటారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ భద్రకాళిదేవి, వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. వీరభద్ర స్వామి ఉత్సవాల్లో భాగంగా ఉగాది తర్వాత ఈ గ్రామంలో పిడకల సమరం జరుగుతుంది.
త్రేతాయుగంలో భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతుంది.వారి మధ్య ప్రేమ వ్యవహారమే కాస్త గొడవకు దారితీస్తుంది. పెళ్లి విషయంలో వీరభద్ర స్వామి కొంత ఆలస్యం చేస్తారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకోకుండా భద్రకాళి దేవిని… వీరభద్ర స్వామి మోసం చేశారని అమ్మవారి భక్తులు నమ్మి, వీరభద్ర స్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు. ఈ విషయం తెలుసుకున్న వీరభద్ర స్వామి భక్తులు అమ్మవారు ఉండే ఆలయం వైపు వీరభద్ర స్వామిని వెళ్ళవద్దని వేడుకున్నారని స్థానికులు అంటున్నారు. స్వామి భక్తులు చెప్పిన మాటలు వినుకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్లారని, అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా వీరభద్ర స్వామి వారిపై పిడకలతో దాడి చేశారని కథలుగా చెప్పుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న స్వామి వారి భక్తులు కూడా పిడకలతో అక్కడికి వెళ్లి అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగారని, అలా ఇరు వర్గాలు పిడకల సమరం సాగించారని అంటుంటారు.
పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు భద్రకాళి అమ్మవారు, వీరభద్ర స్వామి వార్ల ఆలయాలకు వెళ్లి నమస్కారం చేసుకుని అక్కడ ఉన్న విభూతిని ఇరువర్గాలు భక్తులు రాసుకొని రావాలని బ్రహ్మ ఆదేశించాడని, ఆ తర్వాత ఒకే ఆలయంలో ఇద్దరు విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి కళ్యాణం జరిపిస్తామని బ్రహ్మదేవుడు మాట ఇచ్చినట్లు ఆలయ చరిత్ర చెబుతుంది…