Love Guru: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ గురు’. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై విూరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ‘లవ్ గురు’ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ మైత్రీ మూవీ వారితో అసోసియేట్ కావాలనేది నా డ్రీమ్ అని, లవ్ గురుతో ఆ కల నిజమైనందుకు సంతోషంగా ఉందన్నారు. లవ్ గురు కథ విన్నాక ఇది నా కెరీర్ లో బిచ్చగాడు తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందని దర్శకుడు వినాయక్ కు చెప్పానని అన్నారు. అది నిజం కాబోతున్నందుకు సంతోషంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. భరత్ మ్యూజిక్ ఈ మూవీకి ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.
హీరోయిన్ మృణాళిని రవి మాట్లాడుతూ లవ్ గురులో లీల క్యారెక్టర్ లో నటించానని, నా కెరీర్ లో లభించిన గొప్ప క్యారెక్టర్ ఇది అని చెప్పారు. హీరోతో సమానంగా కథలో ఇంపార్టెన్స్ ఉండే రోల్ నాది అని, లీల క్యారెక్టర్ కు న్యాయం చేశాననే అనుకుంటున్నాని అన్నారు. నాపై నమ్మకం ఉంచి ఇంతమంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ వినాయక్ గారికి, విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు నటించనున్నారు.