-
డెడ్ స్టోరేజీ దిశగా మిడ్ మానేరు
-
ఒక్కొక్కటిగా బయటపడుతున్న శిథిలాలు
-
గత స్మృతులను నెమరువేసుకుంటున్న ముంపు వాసులు
-
ఆయకట్టు పరిధిలో ఎండుతున్న పంటలు
-
మున్ముందు సిరిసిల్ల వాసులకు తప్పని నీటి కష్టాలు
-
రోజురోజుకూ పడిపోతున్న భూగర్భ జలాలు
(జనతాప్రతినిధి, కరీంనగర్)
మార్చి ముగిసింది.. ఏప్రిల్ మాసం మొదలైంది.. వేసవి ముగియాలంటే ఇంకా ఏప్రిల్ నెల గడవడంతోపాటు మే నెల కూడా ముగియాలి. జూన్ తరువాతే వర్షాలు ప్రారంభం అవుతాయి. కానీ.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. ఎక్కడ చూసినా భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఇప్పటికే ఆయకట్టు పంటలు సైతం ఎండిపోయాయి. ప్రధానంగా సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది. ప్రాజెక్టులో నీరు అడుగంటుతుండడంతో అందులో మునిగిపోయిన గ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
7 టీఎంసీలే నీటి నిల్వ
మిడ్ మానేరు ప్రాజెక్టు కెపాసిటీ 25 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 7 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. మరో 4 టీఎంసీలు తగ్గితే ఈ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది. అటు కాళేశ్వరం నుంచి నీరు రాకపోవడం.. ఎస్సారెస్పీ నుంచి ఇన్ ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టు పరిస్థితి రోజురోజుకూ డేంజర్ జోన్‌కు చేరుకుంటోంది. దీనికితోడు ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ కోసం 40 క్యూసెక్కుల వరకు వాడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మిషన్ భగీరథకు నీరు సప్లై చేస్తుండడంతో సిరిసిల్ల వాసుల దాహార్తి తీరుతోంది.
For E paper.. click Here..
Daily News E-Paper: Latest News and Insights from Telangana (janathadaily.in)
అయితే ప్రాజెక్టు పరిస్థితి చూస్తే డెడ్ స్టోరేజీకి చేరువగా ఉండడంతో ప్రజల దాహార్తి తీరేదెలా అనే ప్రశ్న మొదలైంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చేపడుతామని చెప్తున్నా.. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. దానికితోడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయన సైతం ప్రజల దాహార్తి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియకుండా ఉంది. గతేడాది జనవరి నుంచి మార్చి వరకు కాళేశ్వరం నుంచి వరదకాల్వ ద్వారా మిడ్ మానేర్ ప్రాజెక్టులోకి 26.70 టీఎంసీల నీరు చేరింది. ఆ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి భారీగా నీరు రావడంతో ప్రాజెక్టు నిండుకుండలా కనిపించింది. గతంలో 5 కిలోమీటర్ల మేర ఉన్న బ్యాక్ వాటర్ ప్రస్తుతం 10కిలోమీటర్ల లోపునకు పడిపోయింది.

తేలుతున్న గ్రామాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడ గ్రామంలో మానేరు నదిపై మిడ్ మానేరు నిర్మించారు. 2005లో మొదలైన ఈ ప్రాజెక్టు పనులు 2018, ఏప్రిల్ 4 నాటికి పూర్తైంది. 25 టీఎంసీల నీటిని నిల్వచేసేలా నిర్మించారు. అయితే.. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. నీలోజిపల్లి, శాభాష్ పల్లి, అనుపురం, రుద్రవరం, కొడిముంజ, చీర్లవంచ, చింతల్ ఠాణా, గుర్రవాణిపల్లె, ఆరెపల్లి, సంకెపల్లి, కొదురుపాక, వరదవెల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అయితే.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ఎండిపోతుండడంతో ఆ గ్రామాల ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఆయా గ్రామాల్లోని బస్టాండులు, ఇళ్లు, స్కూళ్లు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. దాంతో ఆ గ్రామస్తులు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. మరోవైపు.. నాటి స్మృతులను గుర్తుతెచ్చుకుంటూ బాధపడుతున్నారు. అయితే.. ఒకప్పుడు పంటలతో పచ్చగా కనిపించే భూములు.. ఇప్పుడు శిథిలమైన గోడలు.. ఎండిపోయిన చెట్లు.. ఎటుచూసినా విషాద చాయలే కనిపిస్తున్నాయి. చిన్నప్పుడు ఆడుకున్న ప్రాంతాలు.. దేవుడికి చేసిన జాతర గుర్తులు.. చావడిలో ముచ్చటించిన ముచ్చట్లు గుర్త తెచ్చుకుంటున్నారు. ఆస్తులు వచ్చినప్పటికీ.. అప్పటి ఊర్లలోని ఆప్యాయతలు కోల్పోయామని ముంపు బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు ప్రాజెక్టు ఎండిపోతుండడంతో భూగర్భ జలాలు సైతం అదే స్థాయిలో పడిపోతున్నాయి.
