విద్యార్థులు భవిష్యత్ మార్గదర్శకులుగా ఓ వైపు తల్లిదండ్రులు ఉంటే..మరోవైపు ఉపాధ్యాయులు ఉంటారు. అయితే ఇటీవల కాలంలో కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి పిచ్చి పిచ్చి చేష్టలతో ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు. తాజాగా ఓ ఉపాధ్యాయుడు ఏకంగా మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. మద్యం మత్తులో వింతగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే ఉపాధ్యాయుడి ప్రవర్తనకు విద్యార్థులు అంతటితో ఊరుకోలేదు. తాము విద్య కోసం పాఠశాలకు వస్తే ఉపాధ్యాయుడు ఇలా ప్రవర్తించడంపై విద్యార్థులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో అతడిని పాఠశాల నుంచి వెళ్లగొట్టారు. అతను వెళ్లనని వారించినా తరిమి తరిమి కొట్టారు.
ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులు చేసిన ఈ పనికి అందరు మెచ్చుకుంటున్నారు. ఇదే సమయంలో సదరు ఉపాధ్యాయుడిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి ఉపాధ్యాయుల వల్లే విద్యా వ్యవస్థ బ్రష్టు పట్టిపోతుందని విమర్శిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, అప్పుడే విద్యావ్యవస్థ సక్రమంగా ఉంటుందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏదీ ఏమైనా విద్యార్థులు మంచి ఉపాధ్యాయుడిని కోరుకునే క్రమంలో ఒక్కోసారి వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని కొందరు అంటున్నారు.