Saturday, July 5, 2025

Velichala Rajender: పాలిటిక్స్ అంటే ప్యాషన్

  • ప్రజా సేవే లక్ష్యం
  •  నా తండ్రి జగపతిరావు నిత్యం ప్రజల కోసం తపించేవారు..
  •  ఆయనే నాకు ఆదర్శం
  •  తెలంగాణ కోసం కొట్లాడిందే పొన్నం ప్రభాకర్
  •  ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ
  •  ఇక నుంచి నా జీవితం కరీంనగర్‌కే అంకితం
  •  చివరి రక్తపు బొట్టు వరకు అక్కడే ఉంటా..
  •  ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఎజెండా
  •  టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తం
  •  కాంగ్రెస్ పార్టీ నేత వెలిచాల రాజేందర్ రావు

(జనతాప్రతినిధి, కరీంనగర్)

‘పాలిటిక్స్ మీద నాకు ప్యాషన్ ఉంది.. ప్రజాసేవ అంటే ఇష్టం. మా నాన్న కూడా నిత్యం ప్రజల కోసం పరితపించేవారు. మానవసంబంధాలు తెగ్గొట్టి.. మనుషులు మా ప్యాలెస్‌కు రావద్దని అంటరానితనం తెచ్చిన ఘనుడు కేసీఆర్. నాకు చొప్పదండి టికెట్ ఇస్తానని కేసీఆర్ మోసం చేశారు. లేనిపోని ఆరోపణలు చేసి మానసిక క్షోభకు గురిచేశారు. తెలంగాణ తెచ్చిన అని కేసీఆర్ చెప్పుకోవడం తప్పితే.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. తెచ్చింది పొన్నం ప్రభాకర్. నేను టీఆర్ఎస్ పార్టీలోకి పోవుడు మా నాన్నకు ఇష్టం లేదు. ఉద్యమ పార్టీ అని పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ జారుడు బండ మీద కూర్చున్నారు. ఏ క్షణమైనా కింద పడిపోవచ్చు. ఎంపీగా ఉండి బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారు..? గుడికి, బడికి కేంద్రం ఏమైనా నిధులు ఇచ్చిందా..? ఇక నుంచి నా చివరి రక్తంబొట్టు వరకు నేను కరీంనగర్‌లోనే ఉంటా. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవు. టికెట్ ఎవరికిచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం’ అని కాంగ్రెస్ పార్టీ నేత వెలిచాల రాజేందర్ రావు చెప్పారు. ‘మానేరు జనతా’ పేపర్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

కరీంనగర్ స్థానంపై ఇంకా సస్పెన్స్ ఎందుకు..?

గెలుపు, అభివృద్ధి లక్ష్యంగా పార్టీ పావులు కదుపుతోంది. మా పార్టీ అధికారంలో ఉండటంతో సహంజగానే ఒత్తడి ఉంటుంది. ఒక్కో సీటు పార్టీ భవిష్యత్తుకు ఎంతో కీలకం.సామాజిక సమతౌల్యతతో పార్టీ నినిర్ణయాలుంటాయి .కరీంనగర్‌ను అన్ని పార్టీలు సెంటిమెంట్‌గా భావిస్తాయి. ఇక్కడి పరిస్థితులను అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ భారీగా సీట్లను సాధించి మా అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే మా లక్ష్యం. కరీంనగర్ నుంచి కూడా చాలా వరకు టికెట్ కోసం అభ్యర్థన పెట్టుకున్నారు. కానీ.. టికెట్ వచ్చేది మాత్రం ఒక్కరికే.

పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఎందుకిచ్చారు..?

గతంలో నేను ప్రజారాజ్యం పార్టీలో చేరాను. ఆ సమయంలో మా నాన్న వెలిచాల జగపతిరావు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. మా తాత 1950లోనే డీసీసీ ప్రెసిడెంట్‌గా చేశారు. 1972లో జగిత్యాల నుంచి మా తండ్రి జగపతి రావు ఎమ్మెల్యే అయ్యారు. 1978 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచారు. 1989లో కరీంనగర్ ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా గెలిచారు. ఓడిపోయినా ప్రజల మధ్యే ఉన్నారు. చిన్న మచ్చ కూడా లేకుండా జీవించారు. అందుకే ఆయనను టైగర్ జగపతిరావు అని పిలిచేవారు. నేను చొప్పదండి ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా పోటీ చేశాను. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం.. రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ లేకుండా పోయింది, తండ్రి గతేడాది పరమపదించారు. ఆయన ఉన్నన్ని రోజులు కరీంనగర్ ప్రజల కోసం పరితపించారు.నేను కరీంనగర్ ప్రజలతోని సంబంధాలను కల్గి ఉన్నాను . దీంతో నాన్నగారి ప్రజా జీవితాన్ని కంటిన్యూ చేయాలని అనుకున్నాను.

కేసీఆర్‌పై మీకెందుకంత కోపం..?

సామాజికవర్గానికి ఇక్కడ తావులేదు ఆ మాటకొస్తే వెలమ సామాజికవర్గానికి కేసీఆర్ చేసిన ద్రోహం చెప్పలేనిది. ఆయన వల్ల కేవలం ఆయన కుటుంబం, ఆయన బంధువులు మాత్రమే లబ్ధిపొందారు. నేను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం మా నాన్నకు ఇష్టం లేదు. కానీ.. ఉద్యమ పార్టీ అనే ఒకే ఒక సెంటిమెంట్‌తో ఆ పార్టీలోకి వెళ్లాను. 2000 నుంచి 2004 వరకే టీఆర్ఎస్‌లో కొనసాగిన. నేను చేసినంత సేవ కేసీఆర్‌కు ఎవరూ చేయలేదు. అయినా కూడా నాకు అన్యాయమే చేశారు. కేసీఆర్ టికెట్ ఇవ్వకుండా మోసం చేశారు. ముందుగా చొప్పదండి టికెట్ ఇస్తానంటూ బీ ఫామ్ చేతిలో పెట్టి హెలికాప్టర్‌లో కరీంనగర్‌కు తీసుకొచ్చారు. తీరా ఇక్కడికి వచ్చాక బీ ఫామ్ రిటర్న్ ఇవ్వాలని అన్నారు. అందుకు అప్పటి మంత్రి హరీశ్ రావును నా దగ్గరకు పంపించారు. అదే సమయంలో నేను బీ ఫామ్ దొంగతనం చేసి తీసుకొచ్చినట్లు అభాండాలు మోపారు. దానికి ఎంతగానో మానసిక క్షోభ అనుభవించాను. కేసీఆర్ నీరో చక్రవర్తిలాంటివాడు. అందుకే ఫామ్‌హౌజ్ నుంచి పాలన చేశారు. అందుకే.. అన్నింటికి దూరమై బిజినెస్ పనులు చూసుకున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను.

వెలిచాల విజన్ -2029 లక్ష్యమేంటి..?

కరీంనగర్ టికెట్ ఆశించక ముందు నుండే ఇక్కడి ప్రజల కోసం పనిచేయాలని అనిపించింది. ఎందుకంటే ఈ ప్రాంతంతో మా కుటుంబానికి ఉన్న అనుబంధం విడదీయరానిది. అందుకే పార్టీకి సంబంధం లేకుండానే సొంత ఎజెండాతో ముందుకు వచ్చాను. అదే వెలిచాల విజన్- 2029. ప్రజా సమస్యల పరిష్కారానికి నేనొక యాప్ తీసుకొచ్చిన. ‘‘కోహినూర్ కరీంనగర్ సహాయక్’’ యాప్ పేరిట దానిని క్రియేట్ చేసినం. యాప్ ద్వారా సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తా. పర్సనల్‌గా ఏడాదికి రూ.10 కోట్ల నుంచి 12 కోట్ల వరకు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్న. ఇక నుంచి చివరి రక్తపు బొట్టు వరకు కరీంనగర్‌లోనే ఉంటా. కరీంనగర్ ప్రజలకు సేవ చేస్తా. నియోజకవర్గాల వారీగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని నా తండ్రి అనుకున్నారు. నా తండ్రి ఆశయం కోసం పని చేస్తా. అందుకు నా పర్సనల్ ఎజెండా.. మేనిఫెస్టో తయారు చేసుకున్న. ఇప్పటికే స్కూల్, కాలేజీ టాపర్స్‌కు ల్యాప్ టాప్‌లు, లక్ష నగదు బహుమతి, అంబులెన్స్‌లు, డయాగ్నస్టిక్స్ పరికరాలు, జేసీబీ, ట్రాక్టర్లు, సివిల్ సర్వీసెస్ వారికి ఫీజులు, ఓల్డేజీ హోంలకు రూ.50 లక్షలు కేటాయించి దాతల సహాయం తీసుకొని చేస్తున్న.

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పోటీ..?

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అదే ఊపుతో ఎంపీ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాల్లో గెలుపొందబోతున్నాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తుడుచుపెట్టుకుపోయింది. ఇక ఆ పార్టీకి మనుగడ లేదు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోరు ఉంది. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ. రాముడి పేరు చెప్పుకుంటూ ఓట్లు అడుగుతూ ప్రజలను మోసం చేస్తోంది. రాముడు అందరి వాడు. సత్యశీలి కూడా. కానీ.. బీజేపీ నేతలు మాత్రం అబద్ధాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారు.

గ్రూపులపై మీ స్పందన ఏంటి..?

కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ పెద్ద స్థాయిలో ఆలోచన చేస్తున్నది. నేను కూడా అధిష్టానానికి అభ్యర్థన పెట్టుకున్న. టికెట్ ఎవరికి ఇచ్చినా అందరం కలిసికట్టుగా పోరాడుతం. పార్టీ గెలుపే మా లక్ష్యం. మా మధ్య ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవు. అందరి కలిసే ఉన్నాం. ఒకవేళ పార్టీ ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇచ్చినా.. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్‌కు టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా గెలిపించుకుంటాం. నాకు అవకాశం ఇస్తే గట్టిగా, మొండిగా, కసిగా, పోరాడుతా. నాకు సాహసం ఉంది.. ధైర్యం ఉంది. మంచితనం ఉంది. కరీంనగర్‌లో 40వేల మందిని నేను పేర్లతో పిలుస్తాను. మరో 10 వేల మందిని మొఖం చూసి గుర్తుపడుతాను. ప్రజలతో నాకు అంత ర్యాపో ఉంది.

కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశాలేంటి..?

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది మా పొన్నం ప్రభాకర్. ఆయన ఆ రోజు పార్లమెంట్‌లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, తదితర పెద్దలకు దండం పెట్టి తెలంగాణ ఇవ్వండి అని కోరారు. పెప్పర్ స్ప్రే దాడిని సైతం ఎదుర్కొన్నారు. వాటన్నింటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. అందుకే ఆ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీదే. దానికితోడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు పథకాలు అందుతున్నాయి. ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఇంకా పెరుగుతోంది. ఆ పథకాలే మా అభ్యర్థులను గెలిపిస్తాయి. అంతేకాకుండా.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మాకు ముగ్గురు ఎమ్మెల్యేలు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు.

మోడీ, సంజయ్‌కి మీరు వేసిన ప్రశ్నలేంటి..?

ఐదేళ్లు బండి సంజయ్ కుమార్ ఎంపీగా ఉన్నారు. ఆయన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎన్ని ఆలయాలకు నిధులు తెచ్చారు..? వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ఇల్లందకుంట సీతారాముల ఆలయాలు ఉన్నాయి. ఆలయాల కోసం కేంద్రం ప్రత్యేకంగా ప్రసాద్ స్కీమ్ అమల్లోకి తెచ్చింది. ఈ స్కీమ్ కిషన్ రెడ్డి పోర్టు పోలియోలో ఉంది. ఆయనతో మాట్లాడి నిధులు తీసుకురావచ్చు కదా. ఈ దేవుళ్లను మరిచి.. అయోధ్య రాముడి పేరు చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్నారు. సంజయ్ డైలాగులు పేలని సుతిలిబాంబులు. ఎంపీ ల్యాడ్స్ నిధులు అందరు ఎంపీలు సుమారుగా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఖర్చు చేస్తే.. సంజయ్ మాత్రం రూ.5 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయారు. ఐదేళ్ల కాలంలో పార్లమెంటులో కేవలం 53 ప్రశ్నలను మాత్రమే లేవనెత్తారు. దేశంలోనే అత్యల్పంగా ప్రశ్నలు వేసిన ఎంపీగా సంజయ్ నిలిచారు. బండి సంజయ్‌కి నేను 32 ప్రశ్నలు సంధించాను. వాటిపై సంజయ్ సమాధానం చెప్పాలి. అలాగే.. ప్రధాని మోడీకి వేసిన 39 ప్రశ్నలపైనా జవాబు చెప్పాలి.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page