- కాంగ్రెస్ అధిష్టానం వెనకడుగు
- పార్లమెంట్ ఎన్నికల వేళ రిస్క్ వద్దని..
- మంత్రుల మధ్య చిచ్చురేపిన పదవులు
- ముఖ్యనేతలకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు
- హైదరాబాద్‌కు ఆశావాహుల పరుగులు
(జనతాప్రతినిధి, కరీంనగర్)
గత మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన నామినేటెడ్ పదవులకు బ్రేక్ పడినట్లుగా తెలిసింది. ఇప్పటికే ఈ పదవులు పలువురు మంత్రుల మధ్య చిచ్చురేపాయి. దానికితోడు ఆశావహులు సైతం అసంతృప్తికి గురయ్యారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ ప్రయోగం కరెక్టు కాదనుకొని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచనలో పడినట్లు సమాచారం. అందుకే.. మొన్న ప్రకటించిన పదవులన్నింటినీ హోల్డ్‌లో పెట్టినట్లుగా తెలిసింది. దీనికితోడు ఎన్నికల కోడ్ సైతం రావడంతో అధికారికంగా జీవో ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా నామినేటెడ్ అయిన అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది. పేపర్ల పేర్లు వచ్చినా.. అఫిషియల్ జీవో రాకపోవడంతో అసలు తాము నామినేట్ అయినట్లా..? కాదా..? అనే అనుమానం వారిలోనూ వ్యక్తమవుతోంది.
ఆశలపై నీళ్లు..!
మరో 50 రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఉంది. దశాబ్ద కాలం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో నామినేటెడ్ పదవులు వస్తాయని చాలా మంది నాయకులు ఆశతో ఉన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న తమకు న్యాయం జరుగుతుందని భావించారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల ప్రక్రియ ఆ పార్టీలో చిచ్చురేపింది. లిస్టును చూసిన కొందరు సీనియర్లు ఖంగుతిన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి పదవులు రాలేదని కొందరు అధిష్టానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. మరికొందరైతే ఏకంగా పార్టీ పెద్దలను కలిసి తమ బాధను వెల్లబుచ్చారు. ఈ క్రమంలో కరీంనగర్‌కు చెందిన నేతల్లో ఆ అసంతృప్తి మరింత ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ తదితరులు హైదరాబాద్ వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అనర్హులకు పదవులు ఎలా ఇస్తారంటూ అధిష్టానాన్ని ప్రశ్నించినట్లు సమాచారం.
మంత్రుల మధ్య చిచ్చు
మరోవైపు.. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన నామినేటెడ్ పదవులు మంత్రుల మధ్య చిచ్చురేపినట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. హుస్నాబాద్ నుంచి గెలుపొందిన పొన్నం ప్రభాకర్, మంథని నుంచి గెలుపొందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు మొదటి కేబినెట్‌లోనే మంత్రి పదవులు సాధించారు. ఈ క్రమంలో నామినేటెడ్ పోస్టుల ఎంపికలో తనకు సమాచారం లేకుండా చేశారని మంత్రి పొన్నం గుస్సాతో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు కలిసి సుడా చైర్మన్‌ను ఎంపిక చేశారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా సుడా పరిధిలోని నియోజకవర్గాల ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తీసుకోలేదని తెలిసింది. దాంతో వారు కూడా అసంతృప్తికి గురైనట్లు సమాచారం.
వెనకడుగు అందుకేనా..?
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో 33 కార్పొరేషన్లకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చైర్మన్లను ప్రకటించింది. వీరి నియామకంపై చాలా చోట్ల అసంతృప్తి వెల్లడైంది. దాంతో ఈ పరిణామం కాస్త పార్లమెంట్ ఎన్నికలపై పడుతుందని అధిష్టానం ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. అందుకే.. నామినేటెడ్ పదవులపై వెనకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడం.. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తుండడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై అంతో ఇంతో పాజిటివిటి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ మెజార్టీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. దాంతో పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రయోగాలు వద్దని తమ నిర్ణయాన్ని విరమించుకున్నట్లుగా తెలిసింది. అటు మంత్రుల అలక.. ఇటు సీనియర్ నాయకుల ఆగ్రహం మధ్య పార్లమెంట్ ఎన్నికలను గట్టెక్కలేమని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే.. ఎన్నికల తరువాత నామినేటెడ్ వ్యవహారాన్ని చూసుకుందామని ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది.
లిస్టులో మార్పులు.. చేర్పులు..?
మరో వైపు.. అధిష్టానం మూడు రోజుల క్రితం ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ల నియామకంలోనూ పలు మార్పులుచేర్పులు ఉండబోతున్నట్లు సమాచారం. కొందరి నియామకంపై పార్టీకి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ చైర్మన్లపై పూర్తిస్థాయిలో విచారించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. పార్టీలోని ఓ ముఖ్య నేత సమాచారం ప్రకారం.. 33 మంది చైర్మన్ల లిస్టులో చాలా వరకు మార్పులు ఉంటాయనే అభిప్రాయాన్ని చెప్పారు. ఒకవేళ ఇదే జరిగితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రకటించిన మూడు నామినేటెడ్ పోస్టుల్లోనూ మార్పులు తప్పవా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరి పదవి ఊడుతుందా అనే భయం నామినేట్ అయిన వారిని సైతం వెంటాడుతోంది.