- ఆమోదం పొందిన 16 కులాల కార్పొరేషన్లను మాత్రం పట్టించుకోరా?
- తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అధ్యక్షుడు బొద్దుకూరి కిరణ్
మంచిర్యాల, జనతా న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వివిధ కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకుంటోంది.. 16 కులాలకు సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్లను ప్రకటించింది.. అయితే కేబినెట్ లో ఆమోదం పొందని కమ్మ కార్పొరేషన్ కు సంబంధించి రాత్రికి రాత్రే జీవో విడుదల చేశారని, ఇలా చేసి మిగితా కులాల వారిని అవమాన పర్చినట్లేనని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అధ్యక్షుడు బొద్దుకూరి కిరణ్ కుమార్ ఆరోపించారు. మంచిర్యాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే వివిధ కులాలకు మంచి చేస్తున్నామని చెప్పుకొస్తూ 16 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారన్నారు. కానీ కేబినెట్ లో ఆమోదం పొందని ఒక్క కమ్మ కులస్తులకు మాత్రమే రాత్రికి రాత్రికి కార్పొరేషన్ జిఓను విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు.
ప్రజాస్వామిక వ్యవస్థలో అధికారికంగా ఒక మంత్రి ప్రకటించిన 16 కులాల కార్పొరేషన్లను మొదట జిఓలను విడుదల చేయకుండా… వాటిని పక్కన పెట్టి కేవలం కమ్మ కులానికే ప్రాధాన్యతను ఇవ్వడం.. మిగితా కులాలను అవమాన పర్చినట్లు కాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్ళ నుంచి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, దీని వల్ల ఆర్యవైశ్యుల్లో ఉన్న నిరుపేదలకు మేలు జరుగుతుందని వివిధ రకాలుగా అధికారులు, పాలకులపై వినతిపత్రాల ద్వారా ఒత్తిడిని తీసుకువస్తూ.. అవసరమైన చోట ఆందోళన కార్యక్రమాలను నిర్వహించామన్నారు. చివరికి తమతో పాటు మరో 15 కులాలకు కూడా మేలు జరుగుతుందని భావించిన తరుణంలో ప్రభుత్వం పక్కదారిలో ఒకే కులానికి ప్రాధాన్యత ఇస్తు విడుదల చేసిన జిఓను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదా కేబినేట్ లో ప్రకటించిన విధంగా అన్ని కులాల కార్పోరేషన్లకు జిఓలను విడుదల చేయడంతో పాటు విధి విధానాలు రూపకల్పన, బడ్జెట్ కేటాయింపు వెంటనే పార్లమెంటు ఎన్నికల ప్రకటన లోపే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో అన్ని కులాల నాయకులను కలుపుకుని ఐక్య కార్యచరణ వేదికకు సిద్దం అవుతామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా కమ్మ కార్పొరేషన్ కు సంబంధించి సెక్షన్ ఆఫీసర్ సంతకంతోనే జీవో విడుదల అయినట్లు సమాచారం. దీనిపై చీఫ్ సెక్రటరీ సంతకం చేయలేదని తెలుస్తోంది.