- రాజేందర్ రావుకే టికెట్ ఇవ్వాలంటున్న లోకల్ లీడర్స్
- ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలు
- ఇప్పటికే కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన అనుభవం
- ప్రత్యర్థులకు దీటైన అభ్యర్థి ఆయనే అని నేతల్లో అభిప్రాయం
- వ్యక్తిగత పరిచయాలు.. కుటుంబ నేపథ్యం కలిసొస్తుందని రాజేందర్ రావులో ధీమా
(బి.శ్రీనివాస్/జనతాప్రతినిధి, కరీంనగర్)
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. అయితే.. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు స్థానిక లీడర్లు సైతం మద్దతుగా నిలుస్తున్నట్లు సమాచారం. అందుకే అధిష్టానం సైతం ఆలోచన పడిందని తెలిసింది. ప్రవీణ్ రెడ్డి అభ్యర్థిత్వంపై పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలిచేందుకు వెలిచాల రాజేందర్ రావు సైతం ఆసక్తిగా ఉన్నారు.

కుటుంబ నేపథ్యం..
మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు వెలిచాల రాజేందర్ రావు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. దాదాపు దశాబ్ద కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. మరోమారు తన భవిష్యత్తును పరీక్షించేందుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. కరీంనగర్‌ను వేదికగా తీసుకొని ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లాలని ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వెలిచాల జగపతిరావు రాష్ట్రంలోని కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు. రామడుగు మండలం గుండిగోపాలరావుపేట సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా.. ఎమ్మెల్సీగానూ కొనసాగారు. అలాగే.. తెలంగాణ లెజస్లేచర్ల ఫోరం కన్వీనర్‌గా.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్‌గానూ జగపతిరావు కొనసాగారు. మార్క్‌ఫెడ్ చైర్మన్‌గానూ పనిచేసిన ఆయన.. తెలంగాణ నేపథ్యం గురించి.. ఎన్నో రచనలు సైతం చేశారు.
రాజేందర్ రావు విద్యాభ్యాసం..
ఢిల్లీలోని రామ్ జాస్ కాలేజీలో రాజేందర్ రావు బీఏ హానర్స్ పూర్తిచేశారు. ఉస్మానియా క్యాంపస్‌లో 1983లో ఎంబీఏ పూర్తి చేశారు. ఓ నిర్మాణ కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్న ఆయన 1989లో గుండిగోపాల్ రావుపేట సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1991-1994 వరకు కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా.. మార్కెట్ కమిటీ చాంబర్ స్టేట్ సెక్రటరీగా కొనసాగారు. అనంతరం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, కార్యదర్శిగానూ కొనసాగారు. 1992లో నెడ్ క్యాప్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2001-2004 వరకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా యువజన, విద్యార్థి విభాగాల ఇన్‌చార్జిగా పనిచేశారు. 2004లో చొప్పదండి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ రెబల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగారు. దాదాపు 30 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.
For E paper.. click Here..
Daily News E-Paper: Latest News and Insights from Telangana (janathadaily.in)
ఎంపీగా పోటీచేసి.. గట్టి పోటీనిచ్చి..
మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడైన రాజేందర్ రావు గతంలో కొంత కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యహరించారు. తదుపరి పరిణామాల నేపథ్యంలో సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. చిరంజీవి ఆహ్వానం మేరకే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కరీంనగర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాజేందర్ రావు మూడో స్థానంలో నిలిచినప్పటికీ.. గట్టి పోటీనే ఇచ్చారు. అప్పటికి పెద్దగా పుంజుకోని ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి కూడా ఆయన 1.75 లక్షల ఓట్లను సాధించడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ తరఫున పోటీలో నిలిచిన అందరి అభ్యర్థుల్లో రాజేందర్ రావుకే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. కరీంనగర్ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ ఎంపీగా గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన వినోద్ కుమార్ సెకండ్ ప్లేస్‌లో నిలిచారు.
కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తి..
పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన వెలిచాల రాజేందర్ రావుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంచి పేరు ఉంది. అయితే.. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడంతో ప్రజారాజ్యం పార్టీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆంధ్ర పార్టీ అని ముద్ర పడడంతో రాజేందర్ రావు సైతం ఆ పార్టీని వదులుకున్నారు. అప్పటి నుంచి కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తరువాత కేసీఆర్‌కు సన్నిహితంగా మెలిగారు. దశాబ్దంన్నర పాటు కేసీఆర్.. వెలిచాల సేవలను వాడుకున్నారు. అన్ని సంవత్సరాల్లో వెలిచాలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పటికే ఎన్నో ప్రెస్‌మీట్లలోనూ రాజేందర్ రావు అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌పై ఉన్న అసంతృప్తిని వెల్లగక్కుతూ ఆయన 2018లో ‘కేసీఆర్ ఓ జాదూగార్ బాబా’ పేరిట ఓ బుక్ సైతం ప్రచురించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు
దశాబ్దంన్నర పాటు వాడుకొని వదిలేసిన కేసీఆర్‌పై వెలిచాల చాలా అసంతృప్తికి గురయ్యారు. దాంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజేందర్ రావు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. అయితే.. ఇప్పటివరకు కరీంనగర్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ అనూహ్యంగా తన స్థానాన్ని హుస్నాబాద్ నియోజకవర్గానికి మార్చుకున్నారు. దీంతో ఆయన అక్కడ గెలుపొంది మొదటి కేబినెట్‌లోనే మంత్రి సైతం అయ్యారు. ఈ క్రమంలో కరీంనగర్ ఎంపీ స్థానానికి అభ్యర్థి కరువయ్యారు. దాంతో గతంలో ఈ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసిన అనుభవం.. భారీగానే ఓట్లు సైతం సాధించడంతో రాజేందర్ రావును మరోమారు కాంగ్రెస్ తరఫున బరిలో దింపాలని అధిష్టానం ఆలోచనలో పడింది. దీనికితోడు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు వెలిచాల సైతం ఆసక్తి చూపుతున్నారు.
వెలిచాలకే స్థానిక నేతల మద్దతు
ఇదిలా ఉండగా.. కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డిని ముందుగా అనుకున్నా.. అధిష్టానం మరోమారు ఆలోచనలో పడినట్లు తెలిసింది. దీనికితోడు స్థానిక నేతలు సైతం వెలిచాల రాజేందర్ రావు అభ్యర్థిత్వానికే మద్దతునిస్తున్నట్లు సమాచారం. వెలిచాలకే టికెట్ ఇస్తే ప్రత్యర్థులకు గట్టి పోటీనివ్వడమే కాకుండా.. విజయావకాశాలు సులువు అవుతాయని అధిష్టానం వద్ద తమ అభిప్రాయాలను చెప్పినట్లుగా తెలిసింది. స్థానిక నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉండడం.. స్థానికంగా మంచి పేరు ఉండడంతో కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. అందుకే.. దాదాపు వెలిచాలకే కరీంనగర్ టికెట్ ఖరారైనట్లుగా సమాచారం. అంతేకాదు.. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే సెకండ్ లిస్టులోనే ఆయన పేరు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సంజయ్, వినోద్‌కు దీటైన అభ్యర్థి
బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి బరిలో నిలుస్తున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరికి తగిన పోటీ ఇచ్చేందుకు గట్టి అభ్యర్థిని బరిలో దింపాలని ఇప్పటికే అధిష్టానం ఆటోచనలో పడింది. రాజేందర్ రావు అయితేనే వారికి దీటైన పోటీ ఇస్తారని ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. వెలిచాల అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే ఇతర పార్టీల నుంచి ఆయనకు మద్దతుగా నిలిచేందుకు పలువురు నేతలు సిద్ధపడినట్లు సమాచారం. టికెట్ ప్రకటిస్తే తన విజయం ఖాయమనే ధీమాతో వెలిచాల ఉన్నారు. తనకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలు.. తన కుటుంబ నేపథ్యం కలిసి వస్తుందని ఆయన అంటున్నారు.