- ఈ ఏడాది అత్యధికం..
- అప్పుడే ప్రారంభమైన వేసవి వేడి..
- ఇప్పటికే నీటి కరువునుఎదుర్కొంటున్న గ్రామాలు..
- ఓ వైపు అడుగంటుున్న భూగర్భ జలాలు..మరోవైపు నిండుకున్న ప్రాజెక్టులు..
- చుక్కనీరు కరువే అంటున్న నీతి అయోగ్, CWMA ఇండెక్స్..
(కరీంనగర్ ప్రతినిధి, జనతా న్యూస్)
వేసవి కాలం రాగానే నీటి ఎద్దటి ఏర్పడడం సహజమే. కానీ 2024 ఏడాది అత్యంత నీటి కరువు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. వేసవి కాలం పూర్తిగా ప్రారంభం కాకముందే కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మరోవైపు ప్రాజెక్టుల్లో నీరు నిండుకుండడంతో నీటి కరువు తీవ్రంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు యావత్ దేశం మొత్తం ఉండే అవకాశం ఉందని నేషనల్ ‘ఇనిస్ట్యూట్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా, కాంపోజిటివ్ వాటర్ మేనెజ్ మెంట్ ఇండెక్స్ నివేదిక’ తెలిపింది. దేశ చరిత్రలోనే అత్యధిక నీటి సంక్షోభాన్ని 2024 ఏడాదిలో ఎదుర్కొనున్నారని తెలపింది. అలాగే రక్షిత మంచినీరు లభించగా దేశంలో రెండు లక్షల మంది మరణిస్తారని వారు నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో 60 కోట్ల మంది తాగునీరు దొరకక అల్లాడుతున్నారని, దీనిపై ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోతే 2025 నాటికి కోట్లాది మంది తీవ్రమైన నీటి ఎద్దడి బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో..
Drought of drinking water: నీటి సంక్షోభం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రారంభమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీరు అడుగంటుతుండడంతో హైదరాబాద్ మహానగరం తో పాటు మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. నాగార్జునసాగర్ లో ప్రస్తుతం 518 అడుగుల నీటిమట్టం ఉంది. ఎన్ ఎస్ పి లో డెడ్ స్టోరేజ్ లెవెల్ 51 అడుగులు దాటితే హైదరాబాద్ పై నీటి కొరత ప్రభావం పడుతుంది. సాధారణంగా జూన్ లో వర్షాకాలం మొదలవుతుంది. నాగార్జునసాగర్ కు జూలై, ఆగస్టులో వరద వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వచ్చే ఆరు నెలలు ప్రస్తుతం ఉన్న నీటితో దాహార్తి తీర్చుకోవడం దక్షిణ తెలంగాణ జిల్లాలకు కష్టమేనని తెలుస్తోంది. జూరాల నుంచి 0.4 టీఎంసీలు, రామనపాడు నుంచి0.208 టీఎంసీలు, శ్రీశైలం ఎల్లవేరు రిజర్వాయర్ నుంచి 1.765 టీఎంసీలు, ఆలేరు రిజర్వాయర్ నుంచి 1.443 టీఎంసీలు, ఉదయ సముద్రం నుంచి 0.35, అమ్మనాపల్లి నుంచి 7.584, పెండ్లిపాక నుంచి 0.0191,, మొత్తం 11.2769 టిఎంసిలు తాగునీరు అవసరం ఉంది. దీనికోసం పొరుగున ఉన్న కర్ణాటక నీరు తెచ్చుకోవాల్సి ఉందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆ దిశగా కూడా చర్యలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే కరువు..
దీనికి తోడు కృష్ణా బేసిన్లో ఈ ఏడు వర్షపాతం తగ్గడంతో దక్షిణ తెలంగాణ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణాజిల్లాలో నీటి కటకట ఏర్పడే అవకాశం ఉంది. 2023 అక్టోబర్ 6న కృష్ణా నది యాజమాన్య బోర్డు సభ్యత సమావేశంలో ఈ యేడు కృష్ణాజిల్లాలను సాగునీటికి నియమించకూడదని తీర్మానం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను నియంత్రించలేకపోయింది. ఫలితంగా 51 టిఎంసిల కృష్ణ ప్రాజెక్టు నీరు బయటకు తరలించడంతో తాగునీటి కటకట మొదలైంది, కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని హెచ్ కైరావడి తీవ్ర నీటి ఎద్దడి ఉండడంతో అక్కడి సర్పంచ్ గ్రామాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది. గ్రామ అవసరాలు కోసం హంద్రి నదిలో వేసిన తొమ్మిది బోర్లలో ఐదు ఎండిపోయాయి. మిగిలిన నాలుగు బోర్లు రోజుకు గంటకంటే ఎక్కువ నీటిని తోడలేకపోతున్నాయి. ఆ గ్రామంలో 6000 జనాభా ఉంటే ఫిబ్రవరి రెండో వారం నుంచి నాలుగు రోజులకు ఒకసారి తాగునీటి విడుదల చేస్తున్నారు.
ఎండిన జలాశయాలు..కుంగిన ప్రాజెక్టు..
ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్, బొజ్జ కొలాంగూడలో తీవ్రంగా తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంతో అందులో ఉన్న 11 టీఎంసీల నీరును కిందికి వదిలారు. బ్యారేజీ సుందిళ్ల బ్యారేజీలోనూ నీరు లేకుండా పోయింది. అయితే ఎల్లంపల్లి లో 11 టీఎంసీలు ఉంది. ఇందులో నుంచి పెద్దపల్లి వైపు రోజు 120 ఎంఎల్డి, మంచిర్యాల వైపు 80 ఎంఎల్ డి నీటిని సరఫరా చేయాలని మిషన్ భగీరథ సరఫరా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో తాగునీటి కొరత ఇప్పటికే ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, జూలపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో తాగు నీటి కోసం ఇబ్బందులు పడుతు్నారు. కరీంనగర్ జిల్లాలోని శనిగరం, జమ్మికుంట, హుజురాబాద్, రేణిగుంట ప్రాంతాల్లో నీటి కరువు ప్రారంభమైంది. భూపాలపల్లి, పరకాల బెల్ట్ లు సైతం ఇదే సమ్యను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా 3907 ఆబిటేషన్లలో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు.