పెద్దపల్లి, జనతా న్యూస్: రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.శనివారం పెద్దపల్లిలోని నందన గార్డెన్స్ లో తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ (టిఎస్ఎస్ టిఇపి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పెద్దపెల్లి జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులు ప్రైవేట్ రంగంలో అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ప్రత్యేక చోరవతో మెగా జాబ్ మేళాలు జిల్లాలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నిర్వహిస్తున్నామని అన్నారు.ఐటి, ఫార్మసీ, భవన నిర్మాణ రంగం, మార్కెటింగ్, హెల్త్, హాస్పిటాలిటీ మొదలైన పలు రంగాలకు చెందిన కంపెనీలు తమ ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ మేళాలో పాల్గొన్నాయని, పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 1400 పైగా యువకులు తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారని, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే వరకు ప్రభుత్వం ఫాలో అప్ చేస్తుందని అన్నారు.
నూతనంగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో 90 రోజుల వ్యవధిలో 30 వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులకు మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందించామని అన్నారు. 11 వేలకు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిందని , అదేవిధంగా గ్రూపు ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం సైతం నోటిఫికేషన్ జారీ చేసిందని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు మాట్లాడుతూ 65 పైగా ప్రైవేటు కంపెనీలచే నిర్వహించిన ఈ జాబ్ మేళాలో మొత్తం 1538 మంది అభ్యర్థులు టి.ఎస్.- ఎస్.టి.ఇ.పి పోర్టల్ నందు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోగా, 312 మంది అభ్యర్థులు ఎంపిక అయినట్లు, 718 మంది అభ్యర్థులు షార్ట్ లిస్టులో ఉన్నట్టు తెలిపారు.అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే వారికి ఎంపిక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.