మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా క్యూలైన్లో బారులు తీరారు. తెలంగాణలోని దక్షిణ కాశీగా నిలబడే వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ధర్మగుండం, క్యూ లైన్లో భక్తుల రద్దీ కనిపించింది. వరంగల్లోని ప్రసిద్ధ ఆలయమైన వేయి స్తంభాల గుడిలో కొత్తగా నిర్మాణం చేసిన కళ్యాణమండపంను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కుటుంబ సమేతంగా వేయి స్తంభాల గుడిలో పూజలు చేశారు.

ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహా శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. శుక్రవారం పరమశివుడి అనుగ్రహం పొందేందుకు భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీశైలం కొండ భక్తులతో నిండిపోయింది. శుక్రవారం ఉదయం నుంచి పరమేశ్వరుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉచిత దర్శనానికి కిలోమీటర్ మేర భక్తులు వేచి ఉన్నారు. అడ్డు కౌంటర్లు భక్తులతో నిండిపోయింది. శివరాత్రి సందర్భంగా స్వామి అమ్మ వార్లకు సాయంత్రం 5 గంటలకు బ్రహ్మోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ఆదిదంపతులకు నంది వాహనోత్సవం ఉంటుంది. రాత్రి 10 గంటలకు రుద్రాభిషేకం నిర్వహిస్తారు.