(కరీంనగర్ ప్రతినిధి, జనతా న్యూస్)
దక్షిణ కాశీగా పేరొందని వేములవాడ రాజన్నఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతోంది. పార్వతీ సమేతంగా కొలువైన ఈ స్వామిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తరలివస్తుంటారు. అయితే వేములవాడ రాజన్న ఆలయానికి ఓ విశిష్టత ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కోడె మొక్కులు చెల్లించే సాంప్రదాయం పురాతన కాలం నుంచే ప్రారంభం అయింది. కోరికలు కోరే భక్తులు తమకు అనుకున్న విధంగా జరిగితే కోడెమొక్కులు చెల్లించుకుంటారు. ఈ కోడె మొక్కుల విశిష్టత ఈ ఆలయంలో ప్రత్యేకత ఉంటుందని స్థానిక ఆలయ పూజారులు చెబుతున్నారు. అయితే కోడె మొక్కులు ఎందుకు చెల్లిస్తారు? భక్తులు ఎలాంటి కోరికలు కోరుకుంటారు? ఆ వివరాల్లోకి వెళితే..
పూర్వం కరీంనగర్ జిల్లాలో..
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ఆలయం కొలువైంది. 2016 అక్టోబర్ 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వస్థీకరణకు ముందు వేములవాడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేది. వేములవాడను పశ్చిమ చాళక్యులు పాలించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ పేరు మీద రాజన్న ఆలయం గా నామకరనం చేశారని అంటున్నారు. 1830 లో కాశీయాత్రలో భాగంగా ప్రాంతాల్లో మజిలీ చేస్తూ ఈ పుణ్య క్షేత్రం గురించి కాశీ యాత్రలో ప్రస్తావించారు.
ఆలయ పురాణం..
భాస్కర క్షేత్రంగా పిలవబడే దీని గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనువడైన నరేంద్రుడు ఒక రుషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మ హత్యపాతకాన్ని నరేంద్రుడికి బిక్షాటన చేస్తూ దేశ సంచారం చేస్తాడు. దీంతో వేములవాడలోని ధర్మగుండంలో శివలింగం దొరికిందట. దీంతో ఆ శివలింగాన్ని ధర్మగుండం సమీపంలో ప్రతిష్టించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం గురించి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాటు అని చెబుతున్నారు.
కోడెలను ఎలా కట్టాలంటే?
వేములవాడ రాజన్న ఆలయం అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది కోడెమొక్కులు. కోడెలను రాజన్నకు సమర్పిస్తే కోరుకున్నవన్నీ జరుగుతాయని భక్తుల నమ్మకం. కొందరు భక్తలు తమ సొంత కోడెలను గుడి చుట్టూ ప్రదక్షిణలను చేసి ఆలయానికి సమర్పిస్తారు. మరికొందరు ఇక్కడున్న కోడెలను టికెట్ ద్వారా తీసుకొని ప్రదక్షిణ చేస్తారు.
కోడెలను ఎందుకు సమర్పించాలి?
రాజన్న కోడెల గురించి యుగాల నుంచి చెప్పుకుంటున్నారు. పెళ్లి కాని వారు, సంతాన యోగం కలగాలనుకునే వారు స్వామివారికి కోడెలను సమర్పిస్తే అనుకున్నవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం. జాంబవది సమేతుడైన కృష్ణుడు స్వామివారికి ధర్మ దేవ అనే కోడెను సమర్పణ చేసి తద్వారా ‘సాంబుడు’ అనే పుత్రుడిని పొందాడని చరిత్ర చెబుతోంది. అందువల్ల రాజన్న ఆలయంలో పెళ్లికానివారు, సంతానం కోరుకునేవారితో పాటు కోరిన కోర్కెలు నెరవేరాలని భక్తులను కోడెలను కడుతారని చెబుతారు.