- సాంకేతిక ను అందించేందుకు రైతు నేస్తం
- రైతులు ధైర్యాన్ని కోల్పోవద్దు..
- వర్చువల్ ప్రారంభంలో
- సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
తిమ్మాపూర్, జనతా న్యూస్: రైతులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకే ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
వర్చువల్ ద్వారా రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధాన కార్యక్రమాన్ని బుధ వారం సీఎం ప్రారంభించారు.తిమ్మాపూర్ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభ కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథులుగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతులకు ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. పంటల సాగు ప్రారంభించినప్పటి నుంచి పంట ఇంటికొచ్చే వరకు రైతు వెన్నంటే ఉంటుందనిన తెలిపారు. నష్టం వచ్చినా కష్టం వచ్చినా రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. రైతులు ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని, ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. రైతులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రయోగత్మకంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ విధానాన్ని ప్రారంభించామని వెల్లడించారు. తర్వాత అన్నిచోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే వాన కాలం నుంచి రాష్ట్రంలో సాగయ్యే పంటలకు బీమా వర్తింప చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టానికి పరిహారం సకాలంలో అందించి ఆదుకుంటామని పేర్కొన్నారు. నూతన టెక్నాలజీ ఏర్పాటు చేసి సత్వరమే పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రైతులు పంటల సాగులో ఏర్పడే ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే రైతులు అధునాతన పద్ధతులను అవలంబించాలని, తద్వారా శాస్త్రీయ పరిజ్ఞానాన్నిపెంపొందించుకోవాలని పేర్కొన్నారు.

ఒకే విధమైన పంటను సాగు చేయడం వల్ల నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. అలా కాకుండా పంటల మార్పిడి విధానం చేపడితే అధిక లాభాలు సాధించవచ్చని చెప్పారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో వ్యవసాయం చేయాలని, ఈ మేరకు రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రైతులు పండిస్తున్న ప్రతి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లిస్తుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరీంనగర్, నల్గొండ ఖమ్మం, మహబూబునగర్ జిల్లాల్లో రైతులు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఒకవేళ కరువు పరిస్థితులు వస్తే అందరం కలిసికట్టుగా ధైర్యంగా ఎదుర్కొందామని పేర్కొన్నారు. రైతులకు నష్టం జరగకుండా చూస్తామని మరోసారి స్పష్టం చేశారు. రైతు నేస్తం ఉపయోగించుకొని రైతులు మంచి లాభాలు సాధించాలని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మరో మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు హాజరయ్యారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి…
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. వీరు మాట్లాడుతూ తద్వారా పంటల సాగులో మంచి లాభాలు సాధించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటిస్తూ పంటలను సాగు చేయాలని పేర్కొన్నారు. రైతులు ఏ ఇబ్బంది ఎదురైన అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించికోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా రైతులకు అండగా ఉంటుందని, పథకాలను రైతులు సద్వినియం చేసుకోవాలని పేర్కొన్నారు. సేంద్రియ ఎరువుల వాడకం పై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి శ్రీనివాస్, జిల్లా ఉద్యానవనాధికారి శ్రీనివాస్, తహసిల్దార్ కనకయ్య, ఎంపీడీవో విజయ్ కుమార్, వ్యవసాయ అధికారులు, ఏవో సురేందర్, నాయకులు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, మోరపల్లి రమణారెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, పోలు రాము, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.