- రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం… ప్రధానిని కలిస్తే తప్పేంది?
- రేవంత్… భవిష్యత్తులోనూ ఇదే పంథా కొనసాగించండి
- బీజేపీ, కాంగ్రెస్ … తూర్పు పడమర వంటి పార్టీలు.. పొత్తు ప్రసక్తే ఉండదు
- మహిళలకు రూ.2500లు, పెన్షన్ రూ.4 వేలు, రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది?
- మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ కుమార్
కరీంనగర్, జనతా న్యూస్:నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలన్నీ ఆగిపోతాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ అవుతాయన్నారు. ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి కలవడంపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడాన్ని బండి సంజయ్ తప్పు పట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం ప్రధానిని కలిస్తే తప్పేముంది? మోదీని పెద్దన్న అని సంబోధించడంలో తప్పేముంది? అని ప్రశ్నించారు. దీనిని రాజకీయం చేయడం సిగ్గు చేటు అని అన్నారు.
తెలంగాణ నుంచి 7 ఎంపీ సీట్లు బీజేపీ గెలిపిస్తే.. కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొచ్చే బాధ్యత మేం తీసుకుంటామని అన్నారు. . ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత మాది…’’ అని ఉధ్ఘాటించారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందంటూ దుయ్యబట్టారు. హామీల అమలు పేరుతో భారీ ఎత్తున కోతలు పెడుతున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు బట్టేబాజ్ గాళ్లు… రాష్ట్రం మొత్తం 30 నుండి 40 లక్షల మంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, కానీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మాత్రమే ఇస్తామంటున్నారని అన్నారు. . పోనీ అవైనా ఇస్తారా? అంటే అదీ లేదు. కేవలం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఇండ్ల కోసం రూ.3 వేల కోట్ల నిధులు విడుదల చేశారు.. అంటే 6 వేల మందికి మాత్రమే ఇండ్లు కట్టిస్తారట అని ఎద్దేవా చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా బండి సంజయ్ కుమార్ ఈరోజు మానకొండూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉదయం గద్దపాక గ్రామం నుండి మొదలైన యాత్ర మధ్యాహ్నం 3 గంటల వరకు కేశవపట్నం దాకా సాగింది. ప్రజలు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా జనం తరలివచ్చి గ్రామగ్రామాన ఘన స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలోనూ మహిళలు ఎదురై పూలు చల్లి సంజయ్ తోపాటు అడుగులో అడుగు వేస్తూ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కేశవపట్నంలో మహిళలు ప్రత్యేక డప్పులు వాయిస్తూ… టపాసులు పేలుస్తూ… బాణాసంచా పేలుస్తూ సంజయ్ ఘన స్వాగతం పలికారు..