తిమ్మాపూర్, జనతా న్యూస్: ఐదేళ్ల కాలంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇప్పించాలని మండలంలోని మన్నెంపల్లి మాజీ సర్పంచ్ మేడి అంజయ్య ఆత్మహత్య యత్నంకు పాల్పడినాడు. సోమవారం తిమ్మాపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వచ్చాడు. అదే సమయంలో మన్నెంపల్లి మాజీ సర్పంచ్ మేడి అంజయ్య ప్లకార్డును, పురుగుల మందు డబ్బాను చేత పట్టుకుని కార్యాలయం ఎదుటకు వచ్చాడు. అప్పటికే అక్కడ పోలీసు బలగాలతో ఉన్న సీఐలు స్వామి, రాజ్ కుమార్, ఎల్ఎండీ ఎస్సై చేరాలు అంజయ్యను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తనకు బిల్లులు రాలేదని, ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరుతూ ఎంపీడీవో ఆఫీసులోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. పోలీసులు అంజయ్యను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మేడి అంజయ్య మాట్లాడారు. భార్యలపై బంగారము అమ్ముకుని సర్పంచులు పనులు చేస్తే తిమ్మాపూర్ మండలానికి అవార్డు వచ్చిందని, పనులు చేసినా బిల్లులు రాలేదని అన్నారు. 42 మంది సర్పుంచులు చనిపోయినా ప్రభుత్వాలు స్పందించడం లేదని, భవిష్యత్తులో సర్పంచులు చనిపోయే పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల విషయంలో గత ప్రభుత్వ పెద్దలను కలిసినా ఫలితం లేదని, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఇప్పటికైనా బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు.
బిల్లుల కోసం మాజీ సర్పంచ్ ఆత్మహత్యా యత్నం
- Advertisment -